మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇథనాల్ వినియోగానికి త్వరలోనే మార్గదర్శకాలు

10 జులై, 2026

kollu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 09:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల మనుగడను కాపాడటానికి, మిగులు ఇథనాల్‌ను పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ‘ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్’ కోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొనుగోలు చేస్తున్న పరిమాణం చాలా పరిమితంగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో భారీగా ఇథనాల్ నిల్వలు మిగిలిపోతున్నాయని, ఫలితంగా తయారీ యూనిట్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిపోయిన ఇథనాల్‌ను ఫార్మాస్యూటికల్స్, పెయింట్స్, కెమికల్స్ వంటి పారిశ్రామిక వినియోనియోగంతోపాటు ప్రైవేట్ రంగ చమురు కంపెనీలకు విక్రయించేందుకు అనుమతించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలతో కుదుర్చుకున్న ‘ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్’ ఒప్పందం నెరవేర్చిన తర్వాతే, మిగిలిన మొత్తాన్ని ఇతర పరిశ్రమలకు మళ్లిస్తామని అసోసియేషన్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అసోసియేషన్ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి.. పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే మిగులు ఇథనాల్ విక్రయాన్ని సులభతరం చేసేలా త్వరలో నిబంధనలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అవసరాల కోసం అనుమతించే ఈ మిగులు ఇథనాల్ ఎలాంటి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం కాకుండా, మద్యపాన అవసరాలకు మళ్లకుండా కఠినమైన నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. తయారీదారులు ‘ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్’ నిబంధనలను నూటికి నూరు శాతం పాటించేలా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్