- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీదేవి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు సాహిత్యాన్ని గొప్ప మలుపు తిప్పిన మహాకవి గురజాడ అప్పారావు అని ఆఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి పేర్కొన్నారు. కుంచనపల్లి అరవింద స్కూల్‌లో గురజాడ జయంతిని ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక సంఘ సంస్కర్త, అభ్యుదయ భావాల ప్రచారకులు గురజాడ అని వెల్లడించారు. ఆనాటి కాలంలో సమాజంలో అనేక మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలు, బాల్యవివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలు కొనసాగేవని, మహిళలకు సమాన గౌరవం, స్వేచ్ఛ, విద్య అందని పరిస్థితులు ఉండేవన్నారు. అలాంటి కాలంలోనే గురజాడ తన కలంతో సమాజాన్ని ప్రశ్నించారని తెలిపారు. ‘ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అని గురజాడ పేర్కొన్నారని చెప్పారు. గురజాడ రచించిన ‘కన్యాశుల్కం’ తెలుగు నాటక సాహిత్యంలో ఒక సంచలనంగా నిలిచిందన్నారు. ఈ నాటకంలో మధురవాణి వంటి పాత్ర ద్వారా మహిళలోని ఆలోచనా శక్తిని, ఆత్మగౌరవాన్ని, సామాజిక అవగాహనను పెంచేలా రూపొందించారన్నారు. అరవింద పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇంద్రాణి మాట్లాడుతూ.. పండితుల భాషలో మాత్రమే సాహిత్యం ఉండకూడదని, సామాన్య ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ప్రజలకు చేరువ కావాలని గురజాడ భావించారని తెలిపారు. అందుకే గురజాడ సాహిత్యం పుస్తకాలకే పరిమితం కాలేదని, అది ప్రజల జీవితంతో మమేకమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి డి.శ్రీనివాస కుమారి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.అమల శ్రీ, టి.శ్రీదేవి, అరవింద స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)