సిపిఎం, ప్రజా సంఘాల డిమాండ్
కొనసాగిన ఆందోళనలు
ప్రజాశక్తి - యంత్రాంగం : భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని చేస్తున్న ఆందోళనలు మంగళవారమూ కొనసాగాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వక్తలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్‌టిసి బస్టాండ్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ మాట్లాడారు.
పార్వతీపురంలో సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు సిఐటియు మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యాన నిరసన ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు మాట్లాడారు. వీరఘట్ట మండలం ఆంజనేయ జంక్షన్ వద్ద, కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఎన్‌టిఆర్ కూడలిలో వామపక్షాల ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు పాల్గొన్నారు.
విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యాన ఆందోళన చేశారు. డివైఎఫ్ఐ, ఎఐవైఎఫ్ ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొని మాట్లాడారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో రౌంట్‌టేబుల్ సమావేశం సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయులు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. సిపిఎం, వైసిపి, కాంగ్రెస్, సిపిఐ, జైభీమ్ పార్టీ, విసికె పార్టీ, ఎంసిపిఐ(యు), బీఎస్పీ, భారత జనసేన, ఎంఐఎం తదితర పార్టీల నాయకులు హాజరై మాట్లాడారు. 2వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేయాలని సమావేశం ఏకీగ్రీవంగా తీర్మానించింది.
రాజమహేంద్రవరంలోని కృష్ణ సాయి కల్యాణ మండపంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టికె.విశ్వేశ్వరరెడ్డి, వైసిపి సిజిసి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, సిపిఎం, సిపిఐ, ఐద్వా నాయకులు మాట్లాడారు.
జ్ఞానేశ్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ప్రతీ పేరుకు లెక్క చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. 2న కంబాలచెరువు దండి మార్చ్ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది.









కామెంట్‌లు (0)