ప్రజాశక్తి-అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలింగ్, కౌంటింగ్, సున్నితమైన నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ వైసిపి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్ర పోలీసుల జోక్యం లేకుండా హైకోర్టు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన స్వతంత్ర న్యాయ, ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కేంద్ర బలగాలు పనిచేసేలా ఆదేశించాలని వైసిపి నేత లేళ్ల అప్పిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం విచారణ సందర్భంగా ఇదే తరహా అభ్యర్థనతో పిటిషనర్ మరో వ్యాజ్యం దాఖలు చేసిన విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండు పిటిషన్లలోని అభ్యర్థనలు వేర్వేరని పిటిషనర్ తరపున న్యాయవాది పేర్కొనడంతో న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత విచారణను వాయిదా వేశారు.
స్వేచ్ఛగా నామినేషన్ల దాఖలు కోరుతూ మరో పిటిషన్
ఎంపిటిజి, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు లేదా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసిపి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లపై కేసు విచారణ వాయిదా
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సకాలంలో కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వైసిపి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం జరిగితే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నష్టపోతారని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.








కామెంట్లు (0)