పెన్షనర్ల మహా ధర్నాలో వక్తలు డిమాండ్
ప్రజాశక్తి-ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : వివిధ హైకోర్టులు పెన్షనర్లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (ఎపిఆర్‌పిఎ) ఉమ్మడి కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్‌లో మహా ధర్నా నిర్వహించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వందలాది మంది పెన్షనర్లు హాజరై నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవనిగడ్డ పున్నారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి అజయ్, రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఎ శాస్త్రి, సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడారు. గత మూడు నెలల్లో దేశంలోని ఐదు హైకోర్టులు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయని, కానీ అధికారులు వాటిని అమలు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టుల తీర్పుల ప్రకారం హయ్యర్ పెన్షన్ లెక్కింపును పాత పద్ధతిలో చేపట్టి, పెరిగిన పెన్షన్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మద్రాస్, కేరళ హైకోర్టుల తీర్పుల మేరకు 2014 సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు పదవీ విరమణ చేసిన వారందరికీ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ కల్పించాలని, కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రకారం నిలిపివేసిన హయ్యర్ పెన్షన్లను పునరుద్ధరించాలని కోరారు. అనంతరం పెన్షనర్ల ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విజయవాడ అడిషనల్ సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ (ఎపి జోన్)కు అందజేశారు. ఈ వినతిపత్రాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, న్యూఢిల్లీలోని సెంట్రల్ పిఎఫ్ కమిషనర్, సిబిటి సభ్యుడు కరుమళన్‌లకు పంపించేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎల్‌ఐసి పెన్షనర్ల నాయకులు ఎంఎన్ పాత్రుడు, ఎల్‌ఐసి పెన్షనర్ల జిల్లా కార్యదర్శి పి కృష్ణ, బిఎస్‌ఎన్‌ఎల్ నాయకులు అశోక్‌బాబు, కెఎస్‌ఫి బోస్, ఎఫ్‌సిపిఎ కన్వీనర్ ఎన్ రామారావు, కో-కన్వీనర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)