ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

3 గంటల క్రితం

ఐదుగురు మృతి..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 06:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మరొకరికి గాయాలు

ప్రజాశక్తి - టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్‌గేట్‌ ఐదో లేన్‌లో ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐషర్‌ కంటైనర్‌ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతులంతా అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నవంబర్‌ 28న బెంగళూరు నుంచి టాటా నెక్సాన్‌ కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో టంగుటూరు టోల్‌ప్లాజా ఐదో లేన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ముందు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌ బస్సు టోల్‌ చెల్లించేందుకు ఆగడంతో దాని వెనుక కారు కూడా నిలిచింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐషర్‌ కంటైనర్‌ లారీ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు బస్సుకు, లారీకి మధ్య నలిగిపోయింది.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న జాగర్లమూడి శ్రీనివాసరావు (38), సోమేపల్లి సాయికుమార్‌ (31), జాగర్లమూడి శివపార్వతి (30) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కోట కామేశ్వరమ్మ (51), జాగర్లమూడి సాయి (12)లను ఆస్పత్రికి తరలిస్తుండగా, బాలుడు మార్గమధ్యంలో మృతి చెందాడు. గాయపడిన మరో వ్యక్తిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న టంగుటూరు పోలీసులు, సింగరాయకొండ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. టోల్‌ప్లాజా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Horrific accident at Tanguturu toll plaza; five dead

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్