గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేష్ కుమార్‌ 48 గంట‌ల్లో రాజీనామా చేయాలి

36 నిమిషాల క్రితం

జ్ఞానేష్ కుమార్‌ 48 గంట‌ల్లో రాజీనామా చేయాలి
లేకుంటే దేశ‌వ్యాప్త ఆందోళ‌న‌
జంతర్‌మంతర్‌-2.0’ చేపడతాం : సిజెపి హెచ్చరిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- లేకుంటే దేశ‌వ్యాప్త ఆందోళ‌న‌

- జంతర్‌మంతర్‌-2.0’ చేపడతాం : సిజెపి హెచ్చరిక

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ 48 గంట‌ల్లోగా రాజీనామా చేయాల‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సిజెపి) డిమాండ్ చేసింది. లేక‌పోతే దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చేపడతామని, ఢిల్లీలో ‘జంతర్‌మంతర్‌-2.0’ పేరుతో నిరవధిక నిరసనకు దిగుతామని హెచ్చరించింది. గురువారం నాడిక్క‌డ ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సిజెపి క‌న్వీన‌ర్‌ అభిజిత్ దీప్కే, కో క‌న్వీన‌ర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా మాట్లాడారు. జ్ఞానేష్‌ కుమార్ అతిపెద్ద యాంటీ నేషనల్‌ అని, త‌క్ష‌ణ‌మే సిఇసి పదవికి రాజీనామా చేయాల‌ని, భార‌త ప్ర‌జాస్వామ్యానికి ఆయ‌న పెను ప్ర‌మాదంగా మారారని అన్నారు. జ్ఞానేష్ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని విమ‌ర్శించారు. ఇవిఎంలను హ్యాక్ చేయవచ్చని, కాబట్టి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాల‌ని డిమాండ్ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ తొలగింపులపై స్పష్టత ఇవ్వాలని, ప్రభావిత ఓటర్లకు సమర్థవంతమైన పునఃపరిశీలన అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్‌డిఎ, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 2 శాతం మాత్ర‌మే అని తెలిపారు. 13 కోట్ల మంది ఓట‌ర్ల‌ను తొలగించడం అంటే, దాదాపు 13 నుంచి 14 శాతం ఓట్ల‌ను తొలగించ‌డ‌మే అవుతుంద‌ని అన్నారు. ఆ 2 శాతం వ్యత్యాసాన్ని పెంచేందుకు జ్ఞానేష్‌ కుమార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. సిఇసిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, ఎస్‌ఐఆర్‌లో మరిన్ని పేర్ల తొలగింపును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. జనవరి 2025 ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా ఉంచి, పేర్ల తొలగింపులను ధ్రువీకరించే వరకు రికార్డులను భద్రపరచాలని కోరారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన రికార్డులను సుప్రీంకోర్టుకు లేదా న్యాయపరమైన పర్యవేక్షణలోని స్వతంత్ర విచారణకు అప్పగించాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేసి, విస్తృత సంస్థాగత, పౌర సమాజ భాగస్వామ్యంతో కొత్త విధానాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై 48 గంటల్లో సిఇసి స్పందించకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని సిజెపి నేత‌లు ప్రకటించారు. ఢిల్లీలో గతంలో నిర్వహించిన నిరసనల తరహాలో ‘జంతర్‌మంతర్‌-2.0’ చేపడతామని హెచ్చరించారు.

కేర‌ళ‌లో వామ‌ప‌క్షాల ఓట‌మికి ఓట్ల తొల‌గింపే కార‌ణం

కేరళలో వామపక్షాల ఓటమికి ఓట్ల తొలగింపే కారణమని సిజెపి క‌న్వీన‌ర్‌ అభిజిత్‌ దీప్కే విమర్శించారు. పినరయి విజయన్‌ మరోసారి ముఖ్యమంత్రి కావాల్సి ఉన్నప్పటికీ ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించడం వల్ల ఆ అవకాశం దక్కలేదని అన్నారు. తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ నియోజ‌క‌వ‌ర్గంలో ల‌క్ష ఓట్లు తొల‌గించార‌ని, అక్క‌డ ఆయ‌న కేవ‌లం తొమ్మిది వేల‌ ఓట్లతో ఓట‌మి చెందార‌ని తెలిపారు. ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గంలో 40 వేల ఓట్లు తొల‌గించార‌ని, ఆయ‌న కేవ‌లం నాలుగు వేలు ఓట్ల‌ తేడాతోనే ఓట‌మి చెందార‌ని తెలిపారు. పశ్చిమబెంగాల్ లో మమత బెనర్జీ నియోజకవర్గంలో 51 వేల ఓట్లు తొలగించార‌ని, ఆమె 15 వేల ఓట్ల‌ తేడాతో ఓట‌మి పాలయ్యారని అన్నారు. కేంద్రంలో స్పష్టమైన మెజారీ రాదనే భయంతో ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేలా ఓట్ల తొలగింపులు జరుగుతుంటే, దానిని స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. జ్ఞానేష్‌ కుమార్ రాజీనామా విషయంలో తాము వెనక్కు తగ్గేదే లేదని దీప్కే అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్