గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఓట్ల చోరీ’పై సమగ్ర దర్యాప్తు జరపాలి

41 నిమిషాల క్రితం

‘ఓట్ల చోరీ’పై సమగ్ర దర్యాప్తు జరపాలి 
జ్ఞానేష్‌కుమార్‌ అప్రూవర్‌గా మారాలి
రాహుల్‌గాంధీ డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- జ్ఞానేష్‌కుమార్‌ అప్రూవర్‌గా మారాలి

- రాహుల్‌గాంధీ డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం నాడిక్క‌డ‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో అన్ని ఎన్నికలనూ రిగ్గింగ్‌ చేస్తున్నారని అన్నారు. ఓటర్ల జాబితాల్లో పేర్ల తొలగింపు, చేర్పులు, ఇతర మార్పుల ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. "ఆ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తెలివైన పని చేశారు. వారిని నేను అభినందిస్తున్నాను. జ్ఞానేష్‌ కుమార్ 'అప్రూవర్'గా (సాక్షిగా) మారాలి. అది నిజమైన దేశభక్తి అనిపించుకుంటుంది. ఏం జరిగిందో మాకు తెలుసు, మేము దానిని బయటపెడతాం" అని రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతపై ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని, ఓటు హక్కు విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేకుండా వ్యవహరించాలని అన్నారు. సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌కు కేంద్రంలోని పెద్దల మద్దతు ఉందని ఆయన అన్నారు. బిజెపి చాలాకాలం పాటు ఎన్నికల్లో విజయాలు సాధిస్తాయంటూ ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షా చేస్తున్న ప్రసంగాల వీడియో క్లిప్‌లను రాహుల్‌గాంధీ చూపిస్తూ... సాధారణంగా కనిపించే ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ ఇన్‌కంబెన్సీ) ఎన్నికల్లో కనిపించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓట్ల ద్వారా ఎంపికైన వ్యక్తులే చట్టాలను రూపొందిస్తారని ఆయన అన్నారు. "ఓటు వ్యవస్థ దెబ్బతింటే, మన రాజ్యాంగం కూడా దెబ్బతిన్నట్లే. దానికి ఇక ఎలాంటి శక్తి ఉండదు. ఒకవేళ మన రాజ్యాంగం దెబ్బతింటే, మన చట్టాలు చట్టవిరుద్ధం అవుతాయి. మన వ్యవస్థలపై దాడులు జరుగుతాయి.’ అని చెప్పారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు. ఎన్నికలపై నమ్మకం పోతే వచ్చే ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించినా ఎవరూ దానిని నమ్మరని చెప్పారు. "మనం ఇంతకు ముందెన్నడూ లేని ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. మన ఎన్నికల వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది... స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారి," అని ఆయన అన్నారు. జ్ఞానేష్‌కుమార్‌ చేసిన పని దేశానికి వ్యతిరేకమని, ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి అని, దీనికి తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం కానివ్వబోమని అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్