- ఎస్ఐఆర్ ని నిలిపివేయాలి
- 26 నుంచి అక్టోబర్ 2 వరకూ దేశవ్యాప్త నిరసనలు
- ఐదు వామపక్ష పార్టీల పిలుపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికల సంఘం స్వతంత్రతను, విశ్వసనీయతను దెబ్బతీసిన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఐదు వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. గురువారం నాడిక్కిడ సిపిఎం ప్రధాన కార్యాలయం (ఎకె గోపాలన్ భవన్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శులు ఎంఎ బేబీ, డి రాజా, దీపాంకర్ భట్టాచార్య మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా తొలగింపునకు గురైన వారందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు. ఇసిఐ స్వతంత్ర, ప్రజాస్వామ్యయుత పనితీరును పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఉన్న ప్రస్తుత వ్యవస్థను తొలగించాలని, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సుప్రీంకోర్టు ప్రతిపాదించిన ఎంపిక కమిటీ ఆధారిత యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనాన్ని వారు ప్రస్తావించారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు లేవనెత్తిన మౌలికమైన కొన్ని ప్రశ్రలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం పనితీరునే ప్రశ్నార్థకం చేస్తున్నాయని విమర్శించారు. ఇవి కేవలం ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు మాత్రమే పరిమితం కాలేదని, భారత ఎన్నికల సంఘం పనితీరు, సమగ్రతపై కూడా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని తెలిపారు. సిఇసి కార్యాలయం విశ్వసనీయత దెబ్బతిందని, రాజీపడిందని ఆ వివరాలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలపై ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు కనీసం 14 సార్లు అభ్యంతరాలను నమోదు చేశారని, తమ సమ్మతి లేకుండా నిర్ణయాలు తీసుకోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంస్థలు పదేపదే లేవనెత్తిన ఆందోళనలను తాజాగా వెల్లడైన అంశాలు ధ్రువీకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్ఐఆర్, ఓటర్ల జాబితా నిర్వహణ పారదర్శకంగా, వికేంద్రీకృతంగా (డీ సెంట్రలైజ్‌డ్‌గా) ఉన్నాయన్న వాదనలలోని డొల్లతనాన్ని ఇవి బట్టబయలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఓటర్ల డేటాబేస్ క్రమంగా కేంద్రీకృతం కావడం, రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిలలో చట్టబద్ధమైన అధికారుల ప్రవేశంపై ఆంక్షలు విధించడం వంటి అంశాలను ఇద్దరు కమిషనర్లు ప్రత్యేకంగా ఎత్తి చూపారని గుర్తు చేశారు. దీని పర్యవసానాలు కేవలం పరిపాలనాపరమైనవి మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఉదాహరణకు, గోవాలో 97 మంది ఓటర్లు అర్హులని తేల్చిన తమ నిర్ణయాలను నమోదు చేయకుండా, సాఫ్ట్‌వేర్ ఆంక్షల కారణంగా ఎన్నికల నమోదు అధికారులు నిరోధానికి గురైనట్టు నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. అందువల్ల, ఈ సమస్య ఎస్ఐఆర్ పరిధిని మించినదని పేర్కొన్నారు. ఇది ఇసిఐ పారదర్శకత, ప్రజాస్వామ్యయుత పనితీరుకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్ర పరిరక్షణకు సంబంధించినదని తెలిపారు. ఓటు హక్కును పారదర్శకంగా లేని, కేంద్ర నియంత్రిత ప్రక్రియలపై ఆధారపడేలా చేసే ఏ వ్యవస్థ అయినా ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. ఇసిఐ విశ్వసనీయత, స్వతంత్రత ఇంతగా పడిపోవడం మునుపెన్నడూ జరగలేదని విమర్శించారు. వ్యవస్థను తారుమారు చేసి, సంస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసినందుకు సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను జవాబుదారీగా చేయాలని, తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోసం నిరంతరం పోరాడిన షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 26 నుంచి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకూ వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ విభాగాలకు పిలుపునిచ్చారు. బిజెపియేతర, లౌకిక, ప్రజాస్వామ్య ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంస్థలు, పౌరులందరూ ఈ ఉద్యమంలో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎఐఎఫ్‌బి, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శులు జి దేవరాజన్, మనోజ్ భట్టాచార్య పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)