- తమ కుమారుడి మరణానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్
ముంబయి : కుల వివక్ష, వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఐఐటి బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులు గురువారం నిరాహార దీక్ష ప్రారంభించారు. తమ కుమారుడిని వేధించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా సాహిల్ తండ్రి రవీంద్ర వాకోడే మాట్లాడుతూ ‘నా కుమారుడిని వేధించిన వారిని జైలులో పెట్టాలి. విద్యా సంస్థలో తాను పదేపదే కుల వివక్షను ఎదుర్కొన్నానని సాహిల్ చెప్పాడు’ అని తెలిపారు. తమకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాహిల్ ఇస్రోకు ఎంపికయ్యాడని, రోబోటిక్స్, ఎఐ ఈవెంట్‌లో 50 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహించాల్సి ఉందని రవీంద్ర చెప్పారు. ఈ ఘటనను ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సాహిల్ తండ్రి .డిమాండ్ చేశారు. "ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇలాంటివి జరుగుతాయని నాకు తెలియదు. ఇక్కడ ఆత్మహత్యల సంఖ్య చూడండి" అని రవీంద్ర అన్నారు. సాహిల్ తల్లి సోనాలి కూడా ఇద్దరు ప్రొఫెసర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. "నా కొడుకుకి న్యాయం కావాలి. ప్రొఫెసర్ కెడారే, ప్రొఫెసర్ డూల్లాలపై చర్య తీసుకోవాలి. నాకు కావలసిందల్లా న్యాయమే" అని ఆమె స్పష్టం చేశారు. ఈ దీక్షను ప్రారంభించడానికి ముందు రవీంద్ర, ఆయన భార్య సోనాలి ముంబయిలోని 'జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్' చైర్మన్‌ను కలిశారు. తమ కుమారుడి మరణంపై త్వరితగతిన విచారణ జరపాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ నెల 18న సాహిల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)