సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమీక్షలు కాదు.. తక్షణ కరువు సహాయక చర్యలు కావాలి

50 నిమిషాల క్రితం

cpi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై వరుస సమీక్షలు నిర్వహించడం కాకుండా తక్షణ కరువు సహాయ చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమీక్షల పేరుతో కరువు మండలాల ప్రకటనను ఆలస్యం చేస్తే రైతులు మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 476.1 మి.మీ. కాగా, కేవలం 218.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదై 54.2 శాతం లోటు ఏర్పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు కూడా గణనీయంగా పడిపోయింది. సుమారు 26.5 లక్షల హెక్టార్ల (65.5 లక్షల ఎకరాల) మేర మాత్రమే సాగు జరిగినట్లు ప్రభుత్వం చెప్పడం వాస్తవం కాదని, సాగు విస్తీర్ణంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం స్పష్టమైన అధికారిక గణాంకాలను బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు. సాగు చేసిన పంటలకు కూడా వర్షాభావం కారణంగా భారీగా నష్టం వాటిల్లిందని, అనేక ప్రాంతాల్లో వంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్టోబర్ 1 నాటికి కరువు మండలాలను ప్రకటించే ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం చెబుతుండటం సరికాదన్నారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు ప్రారంభించాలని, అక్టోబర్ వరకు ఎందుకు చూడాలని ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్