బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్రమ కేసులు ఎత్తివేయాలి..

51 నిమిషాల క్రితం

preotes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి

- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

ప్రజాశక్తి - కాకినాడ : డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులపైనా, శ్యామ్ ఇ‌న్‌‌స్టిట్యూట్‌‌పైనా పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, పోలీసు కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 11,639 పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలోని సుందరయ్య భవన్‌‌లో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డివైఎఫ్ఐ నాయకులు టి రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న అన్నీ పోస్టులనూ భర్తీ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారన్నారు. అందులో భాగంగా సోమవారం కాకినాడ కొండయ్యపాలెం బ్రిడ్జి నుంచి శాంతియుతంగా ప్రదర్శన చేసుకుంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని అపలేరని హెచ్చరించారు. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులపైనా, శ్యామ్‌‌పైనా పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువతపై పోలీసులు వేధింపులు అపాలని డిమాండ్ చేశారు. హోం మంత్రి విడుదల చేసిన వీడియోలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని అన్నారు. ముందుగా 20 మంది నిరుద్యోగ అభ్యర్థులపైనా కేసులు పెట్టారని, తీవ్ర వ్యతిరేకత రావడంతో తీసివేశారని తెలిపారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ, ఎఐవైఎఫ్ రాష్ట్ర సహ కార్యదర్శి వై బాబి, రిటైర్డ్ ఉపాధ్యాయులు జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారన్నారు. తక్షణమే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు అడిషనల్ ఎస్‌‌పి డాక్టర్ కె కిశోర్ కుమార్ వినతిపత్రం అందించారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై పెట్టిన కేసులపై విచారణ జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం గంగాసూరిబాబు, డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి పెద్దింశెట్టి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సత్యం, లోవరాజు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్