ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోలీసు దెబ్బలకు అస్వస్థత..పట్టువదలని దీక్షతో యువత

5 గంటల క్రితం

పోలీసు దెబ్బకు అస్వస్థత..
పట్టువదలని దీక్షతో యువత
- చలో లోక్‌ భవన్‌ కార్యక్రమం స్ఫూర్తిదాయకం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 10:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • చలో లోక్‌ భవన్‌ కార్యక్రమం స్ఫూర్తిదాయకం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ ‌జ్ఞానేష్‌‌కుమార్‌‌ రాజీనామా, ఎస్‌ఐఆర్‌ ‌రద్దు కోరుతూ విజయవాడలో శనివారం జరిగిన చలో లోక్‌‌భవన్‌ ‌కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున కదిలింది. వందలాదిమంది యువకులు ఉత్సాహంగా రోడ్లపైకి వచ్చారు. ఎన్ని నిర్బంధాలు విధించినా, కార్యాలయాలను ముట్టడించినా అనుకున్న సమయానికి లెనిన్‌ ‌సెంటర్‌‌కు చేరుకున్నారు. దీంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టమైంది. పట్టిన పట్టు వీడకుండా ఎర్రటి ఎండలోనే రోడ్డుపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైనే బైఠాయించి నినదించారు. ఈ క్రమంలో పెనుగాటలు జరిగాయి. ఈసారి ఆందోళనలో వందలమంది పోలీసులు ఉన్నప్పటికీ కొద్దిమంది యువతను అదుపులోకి తీసుకోవడానికి శ్రమించవలసి వచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత ముందుకొచ్చి పట్టుబట్టుకు కూర్చున్నారు. ముఖ్యంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడలిఎస్‌‌యు, పిడిఎస్‌ఒ తదితర సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చారు. అరెస్టులు చేసే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పలువురు యువతీ, యువకులు గాయపడ్డారు. ఒకవైపు యువత ఆందోళనలో పాల్గొంటే మరోవైపు కొంతమంది జెన్‌‌జీ యువత వీడియోలు తీస్తూ సమాచారాన్ని చేరవేస్తూ తమవంతు పాత్ర పోషించారు. వ్యాన్లలో ఎక్కించిన తరువాత కూడా కొంత మంది యువత కిందకు దిగి మరలా రోడ్డపై బైఠాయించారు. అయితే పోలీసులు ఇష్టారాజ్యంగా నెట్టివేయడం, చొక్కాలు, కాళ్లు, చేతులు పట్టుకుని లాగడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు రవి చేతికి గాయమైంది. అతనికి చికిత్స అందించారు. అలాగే ఏలూరు మండలానికి చెందిన మాధవ్‌‌ను పోలీసులు గుండెలపై తన్నారు. వారిని అరెస్టు చేసే క్రమంలో ప్రతిఘటించడంతో పోలీసులు వారిపై మోకాళ్లు పెట్టి నొక్కారు. అలాగే మాధవ్‌ను వ్యాను ఎక్కించే సమయంలో ముగ్గురు పోలీసులు నెట్టారు. అప్పటికీ ఆయన ప్రతిఘటించారు. ఈ క్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటనే సహచరులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఇసిజి పరీక్ష నిర్వహించిన వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. అలాగే భీమవరానికి చెందిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త వంశీ కూడా అదే పరిస్థితి పోలీసులు బలవంతంగా లాగడం, తన్నిరాని చోట్ల తన్నడంతో తీవ్ర అస్వస్థత పాలయ్యాడు. ఛాతిలో నొప్పి రావడంతో వైద్యులు ఇసిజి చూసి ప్రాథమిక చికిత్స అందించారు. అలాగే రాజమండ్రికి చెందిన జ్యోతి కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె కూడా అస్వస్థత పాలయ్యారు. కొంతమంది మహిళా పోలీసులు చేతులు పట్టుకుని లాగే సమయంలో ఇంకొందరు పోలీసుల కాళ్లు ఆమె చేతిపై పడ్డాయి. వీరితోపాటు పదుల సంఖ్యలో యువకులు గాయాలపాలయ్యారు. యువత మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం పోలీసులు బూతులు తిట్టారు. ఆందోళనలో పాల్గొంటూనే బూతులు ఎందుకు తిడుతున్నా రంటూ పోలీసు అధికారులను యువత ప్రశ్నించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్