- రైతుల రుణాలు మాఫీ
- కౌలు రైతులకు పంట నష్ట పరిహారం
- అన్ని పంటలకూ బీమా, ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి
- సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి విపత్కర కరువు పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, తక్షణమే కరువు సహాయక చర్యలు ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చేసిన తీర్మానాన్ని ఆదివారం మీడియాకు విడుదల చేసింది. ‘వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, రాయలసీమలో 65 శాతం, అన్నమయ్య జిల్లాలో 70 శాతం లోటు వర్షపాతం ఉంది. వేసిన కంది, పత్తి, మిర్చి, వేరుశనగ, ఆముదం, వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోయి పదేళ్లుగా పెంచిన చీని చెట్లు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. తక్షణమే కరువుగా ప్రకటించడంతోపాటు కరువు సహాయక చర్యలు చేపట్టాలి. తాగునీటికి కొరత లేకుండా చూడటంతోపాటు వేసిన పంటలను కాపాడాలి. రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాల్లో విత్తనాలు కూడా పడలేదు. ఏ ప్రాంతంలోనూ తాగునీటికి కొరతలేకుండా తాగునీటి పథకాలకు అవసరమైన మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. వారబంది పద్ధతిలో ఉన్న పంటలను కాపాడాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ఉంది. 625 మండలాలకు పైగా వర్షాభావ పరిస్థితులు, 400 మండలాల్లో కరువు పరిస్థితులు, 224 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 40 శాతం పైగా భూముల్లో ఎలాంటి పంటలు వేయలేదు. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీళ్లతో హంద్రీనీవా కింద చెరువులు పాక్షికంగా నింపారు. వేసిన పంటను కాపాడుకునేందుకు వేల రూపాయలు రైతులు ఖర్చు చేస్తున్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం నుండి ఉదారంగా సహాయం రాబట్టి రాష్ట్రాన్ని, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను గ్రామీణ ప్రజలను ఆదుకోవాలి’ అని తీర్మానంలో పేర్కొన్నారు.
ఇళ్లు, ఇళ్ల స్థలాలపై ఒట్టి మాటలు కట్టిపెట్టాలి
- టిడ్కో గృహ రుణాలు రద్దు చేయాలి
పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించి, పక్కా ఇళ్ల నిర్మాణాలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, పట్టణాల్లో స్థలాలు లేవని ప్రభుత్వం చేతులెత్తేయడం గర్హనీయమని సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానంలో పేర్కొంది. ‘స్థలాలు లేవనే సాకుతో పట్టణాల్లో 11 నుండి 14 అంతస్తుల భవనాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షలు ఒక్కొక్క ఇంటికి వ్యయమవుతుందని ప్రకటిస్తున్నారు. 2014 -19 కాలంలో ఏడు లక్షలకు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణం చేస్తామని ప్రకటించి, దానిని మూడు లక్షలకు కుదించారు. అందులో ఇప్పటికీ 1,70,000 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని ప్రభుత్వమే ప్రకటించింది. అందులోనూ 76 వేల ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించలేదు. కేటాయించిన ఇళ్లల్లోనూ సౌకర్యాలు లేక, పేదలు నివాసం ఉండే అవకాశం లేకుండా పోయింది. ఇళ్ళు ఇవ్వకుండానే బ్యాంకులు వడ్డీలతో సహా రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. పేదలందరూ అప్పుల పాలయ్యారు. ఈ పథకం పూర్తిగా విఫలమైంది’ అని తీర్మానంలో తెలిపారు. ఈ అనుభవాలను గమనించకుండా ప్రభుత్వం 15 అంతస్తుల భవనాలు, రూ.17 లక్షల వ్యయంతో నిర్మాణాలు చేస్తామని చెప్పడం సరికాదని వివరించారు. పట్టణాల్లో స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షలు తగ్గకుండా కేటాయించి నిర్మాణాలను ప్రభుత్వమే చేపట్టాలని కోరారు. గతంలో నిర్మించుకున్న ఇళ్లకు బకాయిలివ్వాలని, జగనన్న కాలనీలు నివాసయోగ్యం కాని వాటిని రద్దుచేసి, తాజాగా రెండు, మూడు సెంట్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. పాత కాలనీల్లో, టిడ్కో ఇళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గృహ రుణాలు రద్దు చేయాలని కోరారు.








కామెంట్‌లు (0)