ఉపాధ్యాయులు ఆందోళన వీడి పోరాటానికి సిద్ధం కావాలి
పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి
ఐక్యంతో ముందుకు సాగాలి
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానుజరావు
ప్రజాశక్తి -భీమవరం : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి పూర్తిగా మినహాయించాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి డిమాండ్ చేశారు. స్థానిక చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టెట్‌పై అవగహన శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ గోపి మూర్తి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మూడు ఏళ్ల వ్యవధిలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలనే నిబంధనతో ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి టెట్ నుండి ఇన్ సర్వీస్ టీచర్లను పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసే విధంగా ప్రయత్నం చేయడంతో పాటు పోరాటం చేసేందుకు అంత కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు అండగా నిలబడి టెట్ పై అవగాహన కల్పించడం, శిక్షణా తరగతులు నిర్వహించడం, నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందించడం పట్ల యుటిఎఫ్ ప్రత్యేకత అని జిల్లా కమిటీని అభినందించారు. ఉపాధ్యాయులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే.శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జివివి రామానుజరావు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయులకు యుటిఎఫ్ అండగా ఉంటుందని సమస్యలు పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్యంతో ముందుకు సాగాలని ఆ విధంగా ఉపాధ్యాయులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ ఈ నెల 12, 19, 26 సెలవు దినాలలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించనునట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎoటీవీ సుబ్బారావు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, రిసోర్స్ పర్సన్లు డాక్టర్ బొర్రా శ్రీనివాస్, శ్రీ రెడ్డి రాంబాబు, యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శిలు జి రామకృష్ణంరాజు, కె శ్రీరామకృష్ణ ప్రసాద్, భీమవరం రూరల్ ప్రధాన కార్యదర్శి బి నాగబాబు, భీమవరం పట్టణ శాఖ అధ్యక్షులు బి నరేష్, ప్రధాన కార్యదర్శి కే.వి మల్లేశ్వరరావు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)