మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయింపు చేయాలి

1 గంట క్రితం

UTF
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 12:33 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 3న ‘చలో విజయవాడ’

  • కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి కొత్తగా ఉద్యోగం పొందే అభ్యర్థులతో సమానంగా టెట్‌ అర్హత మార్కులు నిర్ణయించడం సరికాదని, ప్రత్యేక టెట్‌లో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులందరికీ ఒకే కనీస అర్హత మార్కులు నిర్ణయించాలని కోరారు. విజయవాడలోని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ​సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులు భవిష్యత్తులో సర్వీసులో కొనసాగాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 25 నుంచి 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్వహించిన నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులై, సుదీర్ఘకాలంగా బోధనా సేవలందిస్తోన్న ఉపాధ్యాయులు ఇప్పుడు డిగ్రీ, బిఇడి స్థాయి అంశాలను తిరిగి చదివి పరీక్ష రాయడం తీవ్ర ఇబ్బందులతో కూడుకున్నదని తెలిపారు. ఇప్పటికే బోధనతోపాటు శిక్షణ కార్యక్రమాలు, కాంప్లెక్స్‌ సమావేశాలు, ఇతర బోధనేతర పనులతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలంటే విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23(1)ను సవరించాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు తీర్పును సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు.

​కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు వర్తించే అర్హత మార్కులనే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు వర్తింపజేయడం సరికాదన్నారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కొత్త ఉద్యోగం కోసం కాకుండా ఇప్పటికే ఉన్న సర్వీసును కొనసాగించేందుకు టెట్‌ రాస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జనరల్‌ అభ్యర్థులు 150 మార్కులకు 90 మార్కులు సాధించాల్సి ఉండగా, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరికీ ఒకే కనీస అర్హత మార్కును నిర్ణయించాలని కోరారు. మేథమెటిక్స్‌, సైన్స్‌ ఉపాధ్యాయుల విషయంలోనూ ప్రస్తుత విధానం ఇబ్బందికరంగా ఉందన్నారు. మేథమెటిక్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌కు రాష్ట్రంలో వేర్వేరు ఉపాధ్యాయులు ఉన్నారని, ఒక సబ్జెక్టులో నిపుణులైన వారికి ఇతర సబ్జెక్టులపై సమాన స్థాయిలో పరిజ్ఞానం ఉండటం సాధ్యం కాదని తెలిపారు. ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులకు సంబంధిత విభాగంలో 60 మార్కులకు పరీక్ష ఉంటుండగా, మేథ్స్‌, సైన్స్‌ ఉపాధ్యాయులకు సంబంధిత సబ్జెక్టులో కేవలం 20 మార్కులకు మాత్రమే పరీక్ష ఉండటంతో 90 మార్కుల కనీస అర్హత సాధించడం కష్టతరమవుతోందన్నారు. అందువల్ల ఎవరి సబ్జెక్టులో వారికి పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌సిటిఇ నుంచి తగిన అనుమతులు పొందడం ద్వారా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు కనీస అర్హత మార్కులు తగ్గించడంతోపాటు, మేథ్స్‌, సైన్స్‌ ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యమానికి దిగాల్సి వస్తోందని తెలిపారు. ఈ నెల 26 నుంచి 30 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, సెప్టెంబరు 3న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే సెప్టెంబరు 4 నుంచి రాష్ట్ర కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్‌ కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి మనోహర్‌ కుమార్‌, ప్రచార విభాగం ఛైర్మన్‌ ఎం హనుమంతరావు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్