ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన, దళిత బాలికల గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో వరుసగా బాలికలు గర్భం దాల్చుతున్న ఘటనలపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలు అత్యంత తీవ్రమైన విషయంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పరిశీలనలో ఎక్కువ శాతం ఇటువంటి ఘటనలు గిరిజన, దళిత బాలికల హాస్టళ్లలోనే జరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం హాస్టల్, కళాశాల యాజమాన్యాలు, గిరిజన సంక్షేమశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని తెలిపారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన వ్యవస్థ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెలా బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రుతుక్రమం, పోషకాహారం, శారీరక మార్పులు తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ, చాలా హాస్టళ్లలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. రెడ్‌బుక్ నిర్వహణ, నెలవారీ హెల్త్ చెకప్‌లు, కౌన్సెలింగ్ వంటి ప్రక్రియలు సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ప్రతి ఘటన బయటపడిన తర్వాత అధికారులు హడావుడిగా విచారణలు ప్రకటించడం, బాధిత బాలికను ఇంటికి పంపించడం తప్ప శాశ్వత నివారణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఘటనలు పునరావృతమవుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టరు, ఐటిడిఎ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు స్పందించి గురుకులాల్లో బాలికల భద్రతకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా శాశ్వత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ఎఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, మహిళా ఆరోగ్య సిబ్బందిని శాశ్వతంగా నియమించాలన్నారు.
Print Editionబాలికల గర్భందాల్చుతున్న ఘటనలు అత్యంత ఆందోళనకరం : ఐద్వా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 10:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)