బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరిగిన ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు

4 రోజుల క్రితం

prices
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 10:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కనీసం 40 నుంచి 47వేలకు పెంపు

- అడహక్‌ పద్ధతిలో ఖరారు

- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

- వెబ్‌ ఆప్షన్ల కోసం విద్యార్ధుల పడిగాపులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం ఇంజనీరింగ్‌ ‌ఫీజులను పెంచింది. ఇప్పటివరకు ఉన్న కనీస ఫీజు రూ.40వేలను రూ.47వేలకు పెంచుతూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జివో 151ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ‌విడుదల చేశారు. ఎపి ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ(ఎపిహెచ్‌ఇఎఫ్‌ఆర్‌ఎంసి) ప్రతిపాదనలకు మేరకు అడహక్‌ ‌పద్ధతిలో ఈ ఫీజులను ఖరారు చేసింది. వెబ్‌ ఆప్షన్ల ప్రారంభమైన రోజే విద్యార్ధులు, తల్లిదండ్రులు పెరిగిన ఫీజులతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫీజులను ఈ విద్యాసంవత్సరం మధ్యలోనే ప్రభుత్వం సవరించనుంది. కనీస ఫీజును ఇలానే ఉంచనుంది. రాష్ట్రంలో మొత్తం 220 కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 120 కళాశాలలకు ఈ కనీస ఫీజు వర్తించే అవకాశం ఉంది. గరిష్ట ఫీజు నామమాత్రపు కళాశాలలకు రూ.1.05లక్షల వరకు ఉంది. ఇప్పుడు ఈ ఫీజులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఫీజుల పెంపు వల్ల ప్రభుత్వానికి, విద్యార్ధులకు ఆర్ధిక భారం కానుంది.పెరిగిన ఫీజులను ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ‌కింద పేద విద్యార్ధులకు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. ఈ రూపంలో ప్రభుత్వమే ప్రైవేట్‌‌ విద్యాసంస్థలకు ఫీజులు పెంచుతూ ఆర్ధిక భరోసా ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన జివో 151 ప్రకారం ప్రస్తుతం అన్ని ప్రైవేట్‌ ‌కళాశాలలకు రూ.47వేల ఫీజు వర్తించనుంది. 2026-27, 2029-30 బ్లాక్‌ ‌పీరియడ్‌‌కు సంబంధించిన ఫీజును ఇంకా నిర్ధారించలేదు. దీంతో అడహక్‌ ‌రూపంలో ఫీజుల విధానం తీసుకొచ్చింది. ఈ విద్యాసంవత్సరం మధ్యలోనే అన్ని ప్రైవేట్‌ ‌కళాశాలలకు ఫీజులను నిర్ధారించనుంది. గతేడాది నుంచి ఖాళీగా ఉన్న ఎపిహెచ్‌ఇఎఫ్‌ఆర్‌‌ఎంసి చైర్మన్‌ ‌పదవిని ఇంజనీరింగ్‌ ‌కౌన్సిలింగ్‌ ‌ప్రకటనకు రెండు రోజుల ముందు ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో కొత్తగా వచ్చిన కమిటీ ఫీజులపై కసరత్తు చేయనుంది.

రాత్రి వరకు ప్రారంభం కానీ వెబ్‌ ఆప్షన్లు

ఇంజనీరింగ్‌ ‌కౌన్సిలింగ్‌‌లో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నమోదు కాకపోవడంతో ఆప్షన్లు ఇచ్చేందుకు విద్యార్ధులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇంజనీరింగ్‌ ‌కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్‌ ఈ నెల 20వ తేది నుంచి రిజిస్ర్టేషన్‌ ‌ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శనివారం వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 25వ తేదీ(శనివారం) ప్రారంభం కావాలి. కౌన్సిలింగ్‌‌ ప్రారంభించడానికి ముందే నిర్ధారించాల్సిన ఇంజనీరింగ్‌ ‌కళాశాలల ఫీజులను రాష్ట్రప్రభుత్వం వెబ్‌ ఆప్షన్ల ప్రారంభం నాటికి కూడా ఖరారు చేయలేదు. ఫీజుల నిర్ధారణ ఉత్తర్వులు ఆలస్యం కావడంతో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే ఆప్షన్లు ఇచ్చేందుకు విద్యార్ధులు పడిగాపులు కాశారు. కానీ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్న ఉన్నత విద్యాశాఖ ప్రతిసారి పొడిగించుకుంటూ పోయింది. తొలుత మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుందని, ఆ తరువాత 3 గంటలకు, మరలా సాయంత్రం 6 గంటలకు, మళ్లీ రాత్రి 9 గంటలకు వెబ్‌ ఆప్షన్లు ప్రారంభమవుతాయని తన వెబ్‌‌సైట్‌‌లో కళాశాల విద్య సమయాన్ని మార్చుకుంటూ వచ్చింది. చివరకు రాత్రి సుమారు 10 గంటల సమయంలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్