గోదావరికి వరద ఉధృతి
ఆందోళనలో ముంపు మండలాల ప్రజలు
పోలవరం స్పిల్ వే నుండి దిగువకు 2,13,128 క్యూసెక్కులు
ప్రజాశక్తి - యంత్రాంగం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పెరుగుతోంది. కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం మొదలైంది. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎగువ జూరాల నుండి విద్యుత్ ఉత్పాదన ద్వారా 38,225 క్యూసెక్కులు, 12 గేట్ల నుంచి 47,196 క్యూసెక్కులు కలిపి 85,421 క్యూసెక్కుల నీరు చేరింది. అదే సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 827.30 అడుగులు ఉండగా పూర్తిస్థాయి 885 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 46.8234 టిఎంసిలు ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 215.8070 టిఎంసిలు. ప్రస్తుతం తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేశారు.
పోలవరంలో గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదుల జలాలు గోదావరిలో కలుస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వేలోకి వస్తున్న వరద జలాలను 48 గేట్ల నుండి జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్ వే నుండి 2,13,128 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఎస్ఇ రామచంద్రరావు తెలిపారు. స్పిల్ వే ఎగువన 29,250 మీటర్లు, ఎగువ కాపర్ డ్యామ్ ఎగువన 28.300 మీటర్లు నీటిమట్టం నమోదైంది.
ఆందోళనలో ముంపు మండలాల ప్రజలు
భద్రాచలంలో బుధవారం 19 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ గురువారం 29 అడుగులకు చేరుకుంది. దీంతో ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గోదావరి వరద మరో నాలుగు అడుగులు పెరిగితే కుక్కునూరు-దాచారం మధ్య గుండేటి వాగు కాజ్‌వేపైకి వరద నీరు చేరుతుంది. దీంతో వాగు అవతల ఉన్న 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ఎగువున నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లాలోని గోదావరి, శబరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో కురుస్తున్న కొండపోత వర్షాల కారణంగా వరద నీరు భారీగా వచ్చి శబరి నదిలో చేరుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. కూనవరం ప్రాంతంలో శబరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రం 4:30 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 29 అడుగులకు చేరింది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పోలవరం ముంపు మండలాల్లో వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గురువారం అర్ధరాత్రి సమయానికి వరద ప్రవాహం 35 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి, శబరి క్రమేపీ పెరుగుతుండటంతో విఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లోని ముంపు ప్రాంతాల వాసుల్లో భయాందోళన మొదలైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జర్జుల పంచాయతీలోని బొదిలిగూడ గ్రామంలో పలువురి గిరిజనుల నివాస గృహాల గోడలు గురువారం వర్షానికి కూలిపోయాయి.








కామెంట్‌లు (0)