ప్రజాశక్తి-విజయవాడ : స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఇస్తున్న వివరణలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఉద్యోగ నియామకాల్లో మార్గదర్శకాలను ఇష్టానుసారంగా మార్చుకున్నట్లు అనేక ఆధారాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయని తెలిపింది. కొద్దిమందిని ఇప్పటికే అరెస్టు చేయడం, మరికొన్ని ఘటనలపై విచారణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ద్వారా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేసింది.
సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలాన్ని రెగ్యులర్ సర్వీసుగా పరిగణించాలని సిపిఎం డిమాండ్ చేసింది. నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయి పడిన డీఏ, హెచ్‌ఆర్‌ఏలను వెంటనే విడుదల చేయాలని కోరింది. సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు స్పెషల్ గ్రేడ్ స్కేలు మంజూరు చేయాలని, వార్షిక ఇంక్రిమెంట్లతో కనీస వేతనం రూ.30 వేలకంటే తగ్గకుండా అమలు చేయాలని కోరింది. సచివాలయ ఉద్యోగులకు నష్టం కలిగించే జీఓ నంబర్ 11ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వారితో వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని కోరింది.
కానిస్టేబుల్ నియామకాలు వెంటనే చేపట్టాలి
పోలీసు శాఖలో 19,999 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని గతంలో హోంశాఖ మంత్రి ప్రకటించారని సిపిఎం తెలిపింది. ఇందులో 11,639 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరిగిందని పేర్కొంది. అయితే ప్రస్తుతం కేవలం 1,600 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగ యువతలో తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలిపింది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా సుమారు 20 వేల పోలీసు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించింది.
నిరుద్యోగులపై నిర్బంధం తగదు
కాకినాడలో ధర్నా చేసిన నిరుద్యోగులకు, వారికి మద్దతుగా నిలిచిన ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చి వేధించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాజా, సూరిబాబు, రాజేష్ సహా 20 మందిపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శ్యామ్‌ను బెదిరించడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొంది. నిరుద్యోగులు, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.








కామెంట్‌లు (0)