ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో 1,68,821 మంది అనర్హులుగా ఈ నెల 29 నాటికి గుర్తించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎస్‌ఐఆర్‌లో 44.28 లక్షల ఓటర్లకు నోటీసులను ఎన్నికల అధికారులు పంపించారు. రాష్ట్రంలో 7.3 లక్షల మంది ఓటర్ల వివరాలను పాత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయలేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. మరో 36 లక్షలకు పైగా ఓటర్ల వివరాల్లో తేడాలు గుర్తించి నోటీసులు పంపించారు. వీటిలో ప్రధానంగా పేరు రాతలో వ్యత్యాసం, తల్లిదండ్రుల పేర్లలో తేడాలు, వయసు వివరాల్లో వ్యత్యాసాలు తదితర అంశాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 23,154 మంది, తిరుపతిలో 20,938, పల్నాడులో 19,067, ఎన్‌టిఆర్‌లో 12,780, అన్నమయ్యలో 12,179, శ్రీ సత్యసాయి జిల్లాలో 11,266 మంది ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో 9,144, నెల్లూరులో 8,390, పార్వతీపురం మన్యంలో 6,282, శ్రీకాకుళంలో 5,782, గుంటూరులో 5,040, ప్రకాశంలో 4,980, కృష్ణాలో 4,915, బాపట్లలో 4,484, పశ్చిమగోదావరిలో 4,406, విజయనగరంలో 3,012, మార్కాపురంలో 2,610, చిత్తూరులో 2,489 మంది, బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 1,467, విశాఖపట్నంలో 1,220, పోలవరంలో 1,028, ఏలూరు 940, పశ్చిమగోదావరిలో 845, కర్నూలులో 791, నంద్యాలలో 762, అనకాపల్లిలో 483, కాకినాడలో 234, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 133 మంది అనర్హుల జాబితాలో ఉన్నారు. అక్టోబరు 9న ఫైనల్ జాబితాలో ఎంత మంది ఓటర్లు అర్హులో, అనర్హులో తేలే అవకాశం ఉంది. ఎస్‌ఐఆర్‌లో అనర్హులుగా గుర్తించిన వారు వచ్చే నెల 5వ తేదీ వరకు సంబంధిత సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఖరారు చేస్తామన్నారు. అర్హులను తొలగించకుండా, అనర్హులను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)