సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅక్రమ కేసులు, రౌడీషీట్లు ఎత్తివేయకుంటే తీవ్ర ఉద్యమం

7 గంటల క్రితం

అక్రమ కేసులు, రౌడీషీట్లు ఎత్తివేయకుంటే తీవ్ర ఉద్యమం
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, బి.బలరాం
- ఏలూరు కలెక్టరేట్‌ ‌వద్ద గిరిజనుల మహాధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 08:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, బి.బలరాం

  • ఏలూరు కలెక్టరేట్‌ ‌వద్ద గిరిజనుల మహాధర్నా

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ : ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, గిరిజన నాయకులపై బనాయించిన అక్రమ కేసులు, సిపిఎం నేతలు తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావుపై పెట్టిన అక్రమ రౌడీషీట్లు తక్షణమే ఎత్తివేయాలని, ఏజెన్సీ భూసమస్యల్లో పోలీసుల జోక్యాన్ని నివారించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు (వైవి), బి.బలరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏజెన్సీ మండలాల నుండి వచ్చిన వందలాది మంది సిపిఎం నాయకులు, కార్యకర్తలతో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తలు వైవి, బలరాం మాట్లాడుతూ 1/70 చట్టం, ఎల్‌‌టిఆర్‌ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, సాగులో ఉన్న గిరిజనులను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించాలని, సాగు పట్టాలివ్వాలని కోరారు. గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని అడిగినందుకు దుర్మార్గపూరితంగా అక్రమ కేసులు పెట్టి, రౌడీషీటర్లుగా ముద్రవేసి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కేసులో గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఎస్‌‌డిసి కోర్టులు, తిరిగి అదే కేసులో గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా తీర్పు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భూ సమస్యల్లో పోలీసుల జోక్యం ఉండరాదని చట్టం చెబుతున్నా ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్యల్లో పోలీసుల జోక్యం రోజురోజుకీ పెరిగిపోతుందన్నారు. నిర్బంధం, కేసులు, జైళ్లు వంటివి సిపిఎం నాయకులకు, కార్యకర్తలకు కొత్తకాదని, వీటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. పోరాటాల్లో, ఉద్యమాల్లో సిపిఎంకు ప్రజలు అండగా ఉన్నంతకాలం ఏ శక్తినైనా ఎదిరిస్తామని, వెనుకడుగు వేయమని ఉద్ఘాటించారు. అనంతరం సిపిఎం బృందం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి వినతిపత్రం అందజేసింది. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో తహశీల్దార్ల సమక్షంలో రెవెన్యూ అధికారులతో కలసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ సందర్భంగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, డిఎన్విడి.ప్రసాద్, మొడియం నాగమణి, జి.రాజు, పి.రామకృష్ణ తదితరుల పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్