వెనకబడిన వర్గాల ఓట్లు తొలగించేందుకే ఎస్‌ఐఆర్
హిందూ ఇంటర్వ్యూలో ఎం ఎ బేబీ
న్యూఢిల్లీ : ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ సోమవారం డిమాండ్ చేశారు. ఆ పదవినే పట్టుకుని వేలాడడం వల్ల ఆయన ‘బాస్‌లకు’ కూడా నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. వామపక్షాలు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐతో సహా వాటి ప్రజా సంఘాలు,ఇంకా ఇతర పార్టీలు, సంఘాలు విస్తృతంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ ఇప్పటికే రాజీనామా చేసి వుండాల్సిందని బేబీ పేర్కొన్నారు. ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు.
ఎస్‌ఐఆర్ ముసుగులో ఓటు హక్కును లాక్కున్నారు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ముసుగులో 13కోట్ల మంది ఓటింగ్ హక్కులను జ్ఞానేష్ కుమార్ లాక్కున్నారని బేబీ విమర్శించారు. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబాటు వర్గాలకు చెందిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుండి తొలగించేందుకే ఈ ఎస్‌ఐఆర్ ఉద్దేశిందని ఆయన విమర్శించారు. ‘‘ఓటు వేసే హక్కు ఏ ప్రజాస్వామ్యంలోనైనా పవిత్రమైన హక్కు. ఓటు వేసే హక్కును సాధించుకున్నపుడే ఆ పౌరుడు సంపూర్ణ పౌరుడుగా మారతాడు. దాన్ని తిరస్కరించడమన్నది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసే నేరం వంటిది.’’ అని బేబీ వ్యాఖ్యానించారు. ‘‘ఇవిఎంలను తారుమారు చేయవచ్చని, ప్రజా తీర్పును నాశనం చేయడానికి అటువంటి పద్దతులకు పాల్పడతారని ప్రజల్లో ఒక నమ్మకం నెలకొని వుంది. ఈ సమయంలో వంద శాతం వివిపిఎటి (ఓటర్ ధృవీకరించిన పేపర్ ఆడిట్ ట్రయల్) ఒక పరిష్కార మార్గాన్ని అందచేస్తుందని గుర్తించదని. కానీ దాన్ని సక్రమంగా చేయడం లేదు.’’ అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ సిపిఎం మళ్ళీ బలాన్ని పుంజుకోగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో కోలుకునే క్రమంలో వున్నాం. త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలపై కూడా దృష్టి సారించనున్నాం. ఆయా రాష్ట్రాల్లో బిజెపిని ఓడించేందుకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో సిపిఎం చర్చలు జరుపుతుందని చెప్పారు. ‘‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, ఇండియా బ్లాక్‌ను బలోపేతం చేయడం, క్రియాశీలం చేయడం ముఖ్యం. దేశంలో వయోజన ఓటు హక్కు వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భావసారూప్యతా పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు చేతులు కలపాలి. ప్రజా రంగంలోని మేథావులు, కళాకారులు, రచయితలు, ఇతర ప్రముఖుల మద్దతు కూడా ఈ లక్ష్యసాధనకు అవసరమని ఇండియా బ్లాక్ భావిస్తోంది.’’ అని బేబీ పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)