సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరెండేళ్లలో ఇంటింటికీ కుళాయి నీరు

2 గంటల క్రితం

cm.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 12:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • జల్ జీవన్ మిషన్ పనుల శంకుస్థాపన సభలో సిఎం చంద్రబాబు ప్రకటన

  • పులివెందులకూ కుళాయిల ద్వారా నీరు : డిప్యూటీ సిఎం పవన్‌ ‌కల్యాణ్‌

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని 48 వేల గ్రామాల పరిధిలోని 95 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ కుళాయి‌ ద్వారా తాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోమవారం ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార పనుల శంకుస్థాపన పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఇంటింటికీ కుళాయి నీరు, ప్రతి గ్రామానికి స్థిరమైన వనరులు కల్పించడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఇంటి జాగా, ఇంటింటికీ కుళాయి నీరు, ఇంటిపై సోలార్, ఇంటింటికీ గ్యాస్ సదుపాయాలు ఉండాలన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఎపి ఏర్పడిందని, కుళాయి నీరు తాగే సమయంలో ఆయన త్యాగం గుర్తు రావాలనే ఉద్దేశంతోనే అమరజీవి జలధార పేరు పెట్టామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం 40 శాతం నిధులు ఇస్తోందని, మిగిలిన 60 శాతం నిధులు రాష్ట్రాలు భరించాలని వివరించారు. జగన్‌ ప్రభుత్వం ఈ నిధులను వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయిస్తానని తెలిపారు. మాజీ మంత్రి వివేకా హత్య, లిక్కర్ స్కామ్ లబ్ధిదారులెవరో తేలిపోయిందని, ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలన్నారు.

​ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఫలితంగా వేల కోట్ల నిధులు వెనక్కి పోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ప్రధాని సహకారంతో 2030 వరకు ఈ స్కీం గడువు పెంచుకోగలిగామన్నారు. ఉద్దానం, గండికోట, ఏలేరు, తాండవ, ధవళేశ్వరం రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకుంటున్నామని తెలిపారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాలకు కూడా శుద్ధ జలాలను అందిస్తున్నామన్నారు. అల్లూరు జిల్లాలోని పాడేరు, అరకు నియోజకవర్గాల్లోనూ రూ.రెండు వేల కోట్లతో అడవి తల్లి పనులు చేపట్టామని తెలిపారు. ​బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ గత రెండున్నరేళ్ల కూటమి పాలనలోకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, బిసి జనార్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధాకర్ యాదవ్, మాధవి, కృష్ణచైతన్యరెడ్డి, ఆదినారాయణరెడ్డి, జివి.ఆంజనేయులు, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్