- శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఘటన
ప్రజాశక్తి- కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ఎపి మోడల్ స్కూల్ (కెజిబివి టైప్-4) వసతిగృహంలో గురువారం అర్ధరాత్రి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని సవర పూజ (16) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం లక్కయ్యగూడ గ్రామానికి చెందిన సవర బిడ్డికయ్య, తుంబమ్మ ప్రస్తుతం విజయనగరం జిల్లా రాజాంలో ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె పూజ కొద్ది రోజుల కిందట కొత్తూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపిసి ప్రథమ సంవత్సరంలో చేరింది. కళాశాలకు అనుబంధంగా ఉన్న కెజిబివి హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. గురువారం ఉదయం కుమార్తెను చూడడానికి తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చారు. ఆ సమయంలో తనకు ఇంగ్లీష్ సరిగా అర్థం కావడం లేదని, చదవడం కష్టంగా ఉందని, ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండని పూజ కోరినట్లు తల్లిదండ్రులు తెలిపారు. రెండు రోజులు తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో మాట్లాడి గ్రూప్ మార్చేందుకు ప్రయత్నిస్తానని తండ్రి సర్ది చెప్పారు. కాగా హాస్టల్ మొదటి అంతస్తులోని ఒక గదిలో పూజ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఉండడాన్ని శుక్రవారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. టెక్కలి డిప్యూటీ డిఇఒ పి.విలియం, ఎంఇఒలు గోవిందరావు, ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ కె.వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకొని హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.








కామెంట్‌లు (0)