గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కస్తూరిబాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

1 రోజు క్రితం

suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు


ప్రజాశక్తి-కొత్తపల్లి : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ విద్యార్థి మృతి కలకలం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని బాత్రూంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువుల వివరాల మేరకు కొత్తపల్లి మండలంలోని ఎం.లింగాపురం గ్రామానికి చెందిన బోయ తలారి రాజు,జయలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె బోయ ఎం. భవ్య (16) కొత్తపల్లిలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యనభ్యసి స్తోంది. బుధవారం తెల్లవారుజామున భవ్య బాత్రూంలోని ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో గమనించిన తోటి విద్యార్థినులు కేజీబీవీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని మొదట కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ వైద్యాధికారిణి ప్రసన్న లక్ష్మి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందిన విద్యార్థిని దగ్గర లభించిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు ఎస్ఐ నారాయణ రెడ్డిలు ఆత్మకూరు ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆత్మకూరు వైద్యశాల ముందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఇఓ, డిఎస్పి మాట్లాడుతూ కస్తూరిబా గాంధీ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మృతి చెందడం జరిగిందన్నారు. ఈ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అలాగే సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలు వివరాలపై పరిశీలన చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్