ప్రజాశక్తి-అమరావతి: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూముల వివాదానికి సంబంధించిన కేసులో ఎసిబి విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతిపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు లేదా ఇతరులు వినియోగించకుండా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పు ఇప్పటికే ప్రజా డొమైన్‌లో ఉన్న పబ్లిక్ డాక్యుమెంట్ అయినందున దానిని ఎవరూ ఉపయోగించరాదని నిషేధించడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ప్రణతికి సంబంధించిన సింగిల్ జడ్జి చేసిన ప్రతికూల వ్యాఖ్యల అమలును తదుపరి విచారణ వరకు నిలిపివేస్తూ, ఆమెపై ఎసిబి విచారణను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అప్పీల్‌లో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం, అసలు పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. కాకినాడలోని జయేంద్రనగర్ భూముల వ్యవహారంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ తమ హక్కులను సమర్థిస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేయగా, తరువాత ప్రభుత్వం మారిన అనంతరం అదే భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని మరో కౌంటర్ దాఖలు చేయడం, సంక్షేమ సంఘం తరపున న్యాయవాది కూడా అదే విధంగా కోర్టుకు తెలియజేయడం, అయితే తమ తరపున అలాంటి సూచనలు ఇవ్వలేదని సంఘం పేర్కొనడం వంటి పరిణామాలను సింగిల్ జడ్జి తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా గతంలో ప్రైవేటు వ్యక్తుల తరపున హాజరైన ప్రణతి.. తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించడం, ప్రస్తుతం ఆ ప్రైవేటు వ్యక్తుల తరపున ఆమె భర్త రాహుల్ చౌదరి హాజరవుతున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎసిబి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రణతి అప్పీల్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసిన ధర్మాసనం మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ తదుపరి విచారణ వరకు పరిమిత ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి అప్పీల్‌పై మధ్యంతర ఉత్తర్వులు
31 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)