శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిఎస్‌‌సి-2025 ఎంపికలపై కంప్యూటర్ క్రాస్ వెరిఫికేషన్‌కు ప్రభుత్వం సిద్ధమా?

1 రోజు క్రితం

perni nani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 12:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్‌‌సి-2025పై కంప్యూటర్ క్రాస్‌ ‌వెరిఫికేషన్‌‌కు వైసిపి నుండి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమో కాదో తెలపాలని మాజీ మంత్రి పేర్ని వెంక్రటామయ్య (నాని) అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారా లోకేష్ తన ‘యువగళం’ కోటా కింద, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రజలే ఆధారాలతో సహా ఈ పాపాలను బట్టబయలు చేస్తున్నా, ప్రభుత్వం ఇంకా బుకాయించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిఎస్‌‌సి-2025లో ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్, కేటగిరీ, సబ్జెక్ట్ అర్హత, కేటాయించిన పోస్టును కంప్యూటర్ ఆధారంగా క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా అని నాని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో సమర్పించిన సర్టిఫికెట్లను, ముఖ్యంగా జరగని ఈవెంట్లకు సంబంధించినవిగా ఆరోపణలు వస్తున్న సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో వెరిఫై చేయించాలని కోరారు. ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు జగన్‌ తీగ లాగితే, డిఎస్‌‌సి-2025 పాపాల డొంకంతా కదులుతోందని అన్నారు. నిన్నటిదాకా అసలు తప్పే జరగలేదన్న ఈ పాలకులు, ఇవాళ 16 వేల మందిలో ఒక్క తప్పు జరిగిందని తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. జిఓ 15 ప్రకారం టీచర్ ఉద్యోగం రావాలంటే టెట్ అర్హత తప్పనిసరని, ఏ కోటాలో వచ్చినా ఈ నిబంధన వర్తిస్తుందని, బిసిలకు 75 మార్కులు రావాల్సి ఉండగా, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఒల్లూరు ప్రాథమిక పాఠశాలలో 65 మార్కులు వచ్చిన ప్రభాకర్ కి ఎస్‌‌జిటి ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. కర్ణాటక సరిహద్దున ఉన్న కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఏకంగా 24 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లను నియమించారని చెప్పారు. ఒల్లూరు స్కూల్‌లో ఐదుగురు స్పోర్ట్స్ కోటా టీచర్లు పాఠాలు చెబుతున్నారని అన్నారు. 41 ఏళ్ల వయసులో 2009-10 నాటి జూడో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే, 42 ఏళ్లకు టీచర్ కొలువు ఇచ్చేశారని వివరించారు. జూడో ఆడేవాళ్లే లేని రాష్ట్రంలో 30-40 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. దీనిపై ఎంఇఒ, డిఇఒ కార్యాలయాల్లో కాకుండా ‘గోతులదొడ్డి’ స్కూల్లో చీకట్లో రహస్య విచారణలు ఎందుకు జరుపుతున్నారని వెంకట్రామయ్య ప్రశ్నించారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్