- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి బలరాం
ప్రజాశక్తి - బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : పోలవరం ప్రాజెక్టు 2027నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పోలవరం నిర్వాసితుల సమస్యలపై మాట్లాడకపోవడం విడ్డూరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని ఆదివాసీ విజ్ఞాన కేంద్రం వద్ద ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ కాలనీల్లోని మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏటా వరదల వల్ల నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మొడియం నాగమణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో స్కూల్ తరగతులు కుదించడం అంటే గిరిజన విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనన్నారు. ఐటిడిఎ పరిధిలోని 25 ఆశ్రమ పాఠశాలకుగాను పులి రాముడుగూడెం, రెడ్డి కోపెల్లి, లంక పాకల (కొయిదా స్కూలు), ఇటుకలకోట ఆశ్రమ పాఠశాలలను మూడు నుంచి ఏడు వరకూ తరగతులు చేయడం, మిగిలిన 21 ఆశ్రమ పాఠశాలలో ఐదు నుంచి పది తరగతులు చేయడం సరికాదని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల డ్రాపవుట్లు సంఖ్య పెరుగుతుందని తెలిపారు. పాత పద్ధతిని కొనసాగించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)