ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాస్వామ్యంపై జగన్‌ది ద్వంద్వ వైఖరి

1 గంట క్రితం

atchennaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం జగన్‌కి తగదని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు హితవు పలికారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, నామినేషన్ల ప్రక్రియ, ప్రతిపక్ష అభ్యర్థుల భద్రతపై జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించిన ఆయన వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2020 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులు ఎదుర్కొన్న దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసం, బలవంతపు ఉపసంహరణలపై అప్పట్లో అనేక ఫిర్యాదులు వచ్చాయని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న జగన్‌ గతంలో జరిగిన పరిణామాలపై కూడా వివరణ ఇవ్వాలని అన్నారు. వైసిపి పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కార్యకర్తల భద్రతే ప్రధాన సమస్యగా మారిందని ఆరోపించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులు అడ్డంకులు, బెదిరింపులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై అపనమ్మకం కారణంగా టిడిపి ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను బహిష్కరించిందని గుర్తుచేశారు. ఇలాంటి అసాధారణ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో జగన్‌ ఆలోచించాలని అన్నారు.

పుంగనూరులో జనసేన అభ్యర్థి చినరాయలు నామినేషన్ పత్రాలను చించివేశారన్న ఫిర్యాదులు, నెల్లూరులో బిజెపి మహిళా అభ్యర్థి బి. మానెమ్మపై కత్తితో దాడి జరిగిందన్న ఘటనలను ప్రస్తావించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి 15న అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయగా, ఆయన పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్