సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం ఎత్తుపై జగన్ దుష్ప్రచారం

18 సెప్టెంబర్, 2026

nimmala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:27 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- గత ప్రభుత్వ పాపాలను కూటమి ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం

- జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

- 45.72 మీటర్ల ఎత్తుతోనే పోలవరం నిర్మాణం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలవరం ఎత్తు విషయంలో జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడని, గత ప్రభుత్వ పాపాలను కూటమి ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాడని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం దీనిపై ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నార్దకమైన పోలవరాన్ని పూర్తవుతుందనే భరోసా కల్పించామని, పూర్తిస్దాయిలో జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ గత వైసిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపిందని, ఇప్పుడు ఆ తప్పులను కూటమి ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. 2022 జనవరిలో వైసిపి ప్రభుత్వం ప్రాజెక్టును ఫేజ్-1, ఫేజ్-2గా విభజిస్తూ, 41.15 మీటర్ల ఎత్తును ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. అప్పటి స్పెషల్ సిఎస్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఈవోకు లేఖ రాసి రూ.10,911.15 కోట్ల నిధులు కోరారని చెప్పారు. అనంతరం జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలవరం ప్రాజెక్టు సిఈ తదితరులు కూడా వైసిపి పాలనలో పలుమార్లు లేఖలు రాశారని, ఆ లేఖల్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. నీటి నిల్వను 41.15 మీటర్లు, 45.72 మీటర్లుగా విభజించి ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసింది జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు. 2024 ఫిబ్రవరి 16న వైసిపి ప్రభుత్వ హయాంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1 అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా నిర్ధారించిందని మంత్రి గుర్తు చేశారు. 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఎప్పుడూ ఫేజ్-1, ఫేజ్-2గా విభజించలేదని స్పష్టం చేశారు. 11.02.2019 న జరిగిన 141 వ సాంకేతిక సలహా కమిటీ (టిఎసి) సమావేశంలో 2017-18 ధర స్థాయి (పిఎల్) ప్రకారం రూ. 55, 548. 87 కోట్లకు 45.72 మీటర్ల ఎత్తుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిందని వివరించారు.

45.72 మీటర్ల ఎత్తుతోనే పోలవరం నిర్మాణం

గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు-1980 ప్రకారం పోలవరం స్పిల్‌వే, ఈసిఆర్ఎఫ్ డిజైన్లు 45.72 మీటర్ల ఎత్తుతో, 194.60 టిఎంసి పూర్తి నిల్వ సామర్థ్యానికి అనుగుణంగానే రూపొందించబడ్డాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణ పనులను 45.72 మీటర్ల ఎత్తు, 194.60 టిఎంసి నీటి నిల్వ సామర్థ్యంతోనే పూర్తి చేస్తోందని స్పష్టం చేశారు. “పోలవరం ఎత్తు విషయంలో కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం మాదిరిగా, ఏమాత్రమూ రాజీపడదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా, ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని మంత్రి తెలిపారు. మొదట 41.15 మీటర్లకు నీరు నిల్వ చేసి, తర్వాత 45.72 మీటర్ల కాంటూరుకు నిల్వ చేసేందుకు అవసరమైన ఆర్అండ్ఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రం నుండి ఆమోదం కోరతామని పేర్కొన్నారు.

పోలవరాన్ని విధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వమే.

పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసి, ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 8,122 క్యూసెక్కులకు తగ్గించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు గండికొట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఉంటే ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించగలిగేవారమని మంత్రి తెలిపారు. సుమారు 400 టీఎంసీల నీటిని రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు తరలించి ప్రయోజనం కల్పించే అవకాశం ఉండేదని చెప్పారు. “పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం” అని స్వయంగా నాడు అసెంబ్లీలో ప్రకటించిన వారు ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు.

​డయాఫ్రం వాల్‌ను ధ్వంసం చేసి ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు

వైసీపీ హయాంలో పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు నిర్మాణం మరింత క్లిష్టంగా మారిందని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రం వాల్ ప్రాధాన్యత కూడా తెలియని విధంగా నాటి పాలకులు వ్యవహరించారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కేంద్రం నుంచి నిధులు సాధించి పోలవరం పనులను తిరిగి గాడిలో పెట్టామని మంత్రి తెలిపారు.

ప్రశ్నార్థకంగా మారిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామనే భరోసాను ప్రజలకు కల్పించామని అన్నారు.

పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జీవనాడి

పట్టిసీమ ప్రాజెక్టును గతంలో వృథా ప్రాజెక్టుగా విమర్శించిన వారు, తాము అధికారంలోకి వస్తే పట్టిసీమ, పురుషోత్తమపట్నం పంపులు పీకేస్తామని చెప్పారని మంత్రి గుర్తు చేశారు. అయితే పట్టిసీమ ద్వారా వచ్చిన 500 టిఎంసిల గోదావరి జలాలతో కృష్ణా డెల్టాలో ఐదేళ్లలో సుమారు రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించగలిగామని తెలిపారు. ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టిసీమ కృష్ణా డెల్టాకు ఊపిరి పోస్తోందని చెప్పారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పట్టిసీమ నుంచి 45 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాలో సుమారు 6.80 లక్షల ఎకరాల్లో పంట సాగు జరుగుతోందంటే అందుకు పట్టిసీమ నీరు కీలక కారణమని చెప్పారు. పట్టిసీమ నీరు కృష్ణాడెల్టాకు అందడం వలనే శ్రీశైలం నుండి కృష్ణా నీరు పోతిరెడ్డిపాడు, హద్రీనీవా ద్వారా రాయలసీమ అమసరాలకు ఇవ్వగల్గుతున్నామన్నారు. పట్టిసీమ లేకపోతే శ్రీశైలంకు వచ్చిన కృష్ణానీటిని కృష్ణా డెల్టాకు ఇవ్వవలసి వచ్చి ఉండేదన్నారు. చంద్రబాబు నాయుడు ముందుచూపుతో నిర్మించిన పురుషోత్తపట్నం, పుష్కర లిఫ్ట్ స్కీమ్‌ల వల్లే నేడు గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించగలుగుతున్నామని మంత్రి తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ ద్వారా 16.6 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని మంత్రి వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్