- సమస్యలు పరిష్కరించాలని విజయనగరంలో మంత్రి లోకేష్‌కు వినతి
ప్రజాశక్తి - విజయనగరం కోట : తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ జూనియర్ డాక్టర్స్ సమ్మె శనివారమూ కొనసాగించారు. ర్యాలీలు, చేతులకు పెయింట్ వేసుకుని, మానవహారంగా ఏర్పడి పలు రూపాల్లో నిరసన తెలిపారు. స్టయిఫండ్ పెంచాలని, ప్రొఫెసర్ చెప్పవలసిన వైద్య విద్యను ఎమ్మెస్సీ పిహెచ్‌డి చేస్తున్న విద్యార్థులతో చెప్పించేందుకు సిద్ధ పడడం సరైంది కాదన్నారు.
విజయనగరం జిల్లాకు వచ్చిన మంత్రి లోకేష్‌ను దాసన్నపేట హైస్కూల్లో కలిసి తమ సమస్యలపై జూనియర్ డాక్టర్లు వినతి పత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ సోమవారం ఈ విషయమై సమాచారం వస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రేవంత్, ఉపాధ్యక్షులు జశ్వంత్, సెక్రటరీ మోహిత్, స్పోక్స్ పర్సన్ పాత్రుడు సోనాల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ కెజిహెచ్‌లోని జూనియర్ డాక్టర్లు కళ్లకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు డాక్టర్ దినకర్ సాయి శ్రీనివాస్ మాట్లాడారు. కర్నూలు జిల్లా కేంద్ర సర్వజన హాస్పిటల్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలే నిరాహార దీక్షల వద్ద నృత్యాలు చేస్తూ, తమ సమస్యలపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కడప నగరలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద సమ్మె కొనసాగింది. ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సేవలనూ బహిష్కరించారు. చేతులకు పెయింటింగ్ వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్లుతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కూడా అత్యవసర సేవలకు దూరంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సిఐటియు ప్రతినిధి బృందం మద్దతు తెలిపింది. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు ఆస్పత్రి ప్రాంగణం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు.








కామెంట్‌లు (0)