ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జోయ మరణం మహిళా ఉద్యమాలకు తీరని లోటు

2 గంటల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్. పుణ్యవతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఎం సీనియర్ నాయకురాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సీనియర్ నేత యార్లగడ్డ జోయ మరణం మహిళా ఉద్యమాలకు తీరని లోటని ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్. పుణ్యవతి పేర్కొన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా యార్లగడ్డ జోయ చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జోయతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయాలను అధికార సాధనగా కాకుండా ప్రజా సేవకు అంకితం చేసిన అరుదైన ఉద్యమ నాయకురాలిగా జోయ నిలిచిపోయారని కొనియాడారు. చిన్ననాటి నుంచే ప్రజా ఉద్యమాలతో మమేకమైన జోయ తన జీవితాన్ని మహిళల హక్కులు, సమానత్వం, రైతులు, వ్యవసాయ కార్మికుల సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంకితం చేశారని తెలిపారు. నందిగామ డివిజన్ సీపీఎం కార్యదర్శిగా, ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యురాలిగా, ఐద్వా రాష్ట్ర నాయకురాలిగా, అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఆమె నిర్వహించిన బాధ్యతలు ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. మహిళలపై హింస, లైంగిక దాడులు, వివక్షకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ మహిళా హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. అలాగే రైతుల సమస్యలు, ముఖ్యంగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ఉత్పత్తిదారుల సమస్యలు, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై ప్రభుత్వాల దృష్టి సారించేలా ఎన్నో పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పుణ్యవతి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే జీవిత లక్ష్యంగా భావించి చివరి వరకు ఉద్యమ బాటలో నడిచిన యార్లగడ్డ జోయ సేవలను ప్రజలు ఎప్పటికీ మరువరని పేర్కొన్నారు. యార్లగడ్డ జోయ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అవుతుందని పుణ్యవతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రి, రమాదేవి, మస్తాన్ బి, శ్యామల, సత్యవతి. పూర్ణ, ప్రధావతి, శ్రీనివాస కుమారి, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్