- ముగ్గులు వేస్తూ, పలు రూపాల్లో నిరసనలు
- సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక
ప్రజాశక్తి - యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఆదివారమూ కొనసాగింది. పలుచోట్ల ముగ్గులు వేస్తూ, సండే ఆకారంగా ఏర్పడి వినూత్న నిరసనలు తెలిపారు. కడప జిజిహెచ్‌లో (రిమ్స్) జూనియర్ డాక్టర్లు సండే ఆకారంగా నిలబడి నిరసన తెలిపారు. అత్యవసర సేవలు మినహా, ఇతర వైద్య సేవలు బహిష్కరించారు. విశాఖలోని కెజిహెచ్ వద్ద ముగ్గులు వేసి నిరసన తెలపుతూ రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. కార్యక్రమంలో డాక్టర్ రక్షక్, డాక్టర్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు సర్వజన హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం కొనసాగింది. స్టైఫండ్ పెంచాలని, ఎన్ఎంసి నిబంధన ప్రకారం ఫ్యాకల్టీ నియామకం చేపట్టాలని జూనియర్ డాక్టర్లు నినాదాలు చేశారు.
గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన రెసిడెంట్లు ఇంటర్న్‌లు, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శాంతియుత నిరసన కొనసాగించారు. ఫోన్ టార్చ్‌లైట్ వెలుగుతో వినూత్న నిరసన తెలిపారు. 15 మంది పీజీ రెసిడెంట్లు స్వచ్ఛంద రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సమ్మె ప్రారంభం అయి రెండు వారాలు అవుతున్నా ఇంత వరకు ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడం దారుణమని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలో జూనియర్ డాక్టర్లు ఆదివారం అత్యవస సేవలను బహిష్కరించారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కొనసాగిన నిరసనలో జూనియర్ డాక్టర్లుతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కూడా పాల్గొని అత్యవసర సేవలకు దూరంగా ఉన్నారు.







కామెంట్‌లు (0)