- ప్రజా సంఘాల నేతల డిమాండ్
ప్రజాశక్తి - కృష్ణా ప్రతినిధి : బందరు పోర్టు రెండో దశ విస్తరణలో భూములు కోల్పోయే రైతులు, పేదలకు న్యాయమైన పరిహారం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జొన్నా శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నార్త్ మండలం తపశపూడిలో బుధవారం ప్రజా సంఘాల నాయకులు పర్యటించారు. నిర్మాణంలో ఉన్న బందరు పోర్టును, దాని సమీపంలో రెండో విడత సేకరించనున్న భూములను నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమ గ్రామంలోని భూముల మార్కెట్ విలువ ఎకరం రూ.1.20 కోట్లు వరకు ఉందని గ్రామస్తులు వివరించారు. పోర్టుకు భూములు సేకరించే ప్రాంతంలోనూ ఎకరం రూ.30 లక్షలకు రిజిస్ర్టేషన్లు జరిగాయని తెలిపారు. పేదలు సాగు చేసుకుంటున్న ఎసైన్డ్ భూములకు ఎకరాకు రూ.తొమ్మిది లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని గ్రామానికి చెందిన పాతపాడు అంజియ్య, పంతగాని నాగేశ్వరరావు వాపోయారు. ఈ సందర్భంగా నాయకులు వి.వెంకటేశ్వర్లు, జోన్న శివశంకరరావు మాట్లాడుతూ... భూ సేకరణ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని, పరిహారం, పునరావాసంపై అధికార యంత్రాగం వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరారు. తొమ్మిదేళ్ల క్రితం మొదటి దశ పోర్టు భూ సేకరణకు ప్రభుత్వం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించిందని గుర్తు చేశారు. రెండో దశ భూ సేకరణలోనూ మార్కెట్ విలువలను ప్రామాణికంగా తీసుకుని 2013 భూ సేకరణ చట్టం నిబంధనలకు అనుగుణంగా పట్టా భూముల రైతులకు, ఎసైన్డ్ భూములు సాగు చేసుకునే పేదలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్ట నిబంధనల ప్రకారం ఎసైన్డ్ భూములకు సైతం పట్టా భూములకు ఇచ్చిన విధంగానే పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పర్యటనలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం నారాయణరావు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శివనాగేంద్రం, నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కొడాలి శర్మ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)