మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కంకిపాడులో కలకలం

1 గంట క్రితం

gun fire.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 10:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోలీసులపై కత్తితో దాడి చేసిన గంజాయి నిందితుడిపై కాల్పులు

​ప్రజాశక్తి - కంకిపాడు, విజయవాడ అర్బన్‌ : కృష్ణా జిల్లా కంకిపాడు పరిధిలో గంజాయి ముఠా ప్రధాన నిందితుడు పోలీసులపై కత్తితో తెగబడిన ఘటన కలకలం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ శివారులో పోలీసులు ప్రయత్నించగా, లొంగిపోకుండా మరోసారి కత్తితో దాడికి యత్నించాడు. దీంతో కంకిపాడు సిఐ ఆత్మరక్షణ కోసం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి, బుల్లెట్ గాయంతో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్‌‌పి వి.విద్యాసాగర్‌ ‌నాయుడు మంగళవారం పెనమలూరు పోలీసుస్టేషన్‌‌లో మీడియాకు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యర్నగూడెం గ్రామ సమీపంలో ఎన్‌‌హెచ్‌ - 16 సర్వీస్ రోడ్డుపై సోమవారం ఉదయం హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఎన్.లోవరాజు, ఎఆర్‌ కానిస్టేబుల్‌ వి.వెంకటేశ్వరరావులకు నలుగురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించారు. వారు రెండు బ్యాగులు, ఒక డ్యూక్ మోటార్ సైకిల్, ఒక స్కూటీతో సంచరిస్తుండటంతో వారిని ఆపి ప్రశ్నించారు. దీంతో నిందితులు కానిస్టేబుల్‌ ‌వెంకటేశ్వరరావుపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనపై దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు అక్కిదాసరి అవినద్.. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అందించిన సాంకేతిక సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికొండ గ్రామ శివారులో నిందితుడు అవినద్‌‌ను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే నిందితుడు గన్నవరం కానిస్టేబుల్‌ దేవిశెట్టి శ్రీనుపై కత్తితో దాడి చేశాడు. రాళ్లు విసిరి గన్నవరం సిఐ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశాడు. గన్నవరం, కంకిపాడు సిఐలు పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో ఇద్దరు సిఐలు చెరో రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు. కత్తితో దాడికి ప్రయత్నించడంతో కంకిపాడు సిఐ ఒక రౌండ్ మోకాలి దిగువ భాగంలో నిందితుడిపై కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌‌కు ఛాతి భాగంలో లోతైన గాయం కావడంతో కంకిపాడు సిహెచ్‌‌సిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గన్నవరం సిఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణకు గుడివాడ ఎస్‌‌డిపిఒను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్