శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొమరం స్వరాజ్యేశ్వరమ్మ మృతి మహిళోద్యమానికి తీరని లోటు

7 గంటల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పేగు బంధానికి తలొగ్గని ఉద్యమ స్ఫూర్తి, భద్రాచలం డివిజన్ తొలి తరం మహిళా నాయకురాలు కొమరం స్వరాజ్యేశ్వరమ్మ మృతి మహిళోద్యమానికి తీరని లోటని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి తెలిపారు. ఆమె పోరాట జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొమరం మండలం కరకగూడెం గ్రామంలో జన్మించిన స్వరాజ్యేశ్వరమ్మ చిన్ననాటి నుండే వామపక్ష భావజాలానికి ఆకర్షితమై ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. 1978లో భద్రాచలం డివిజన్ ఐద్వా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మహిళలు, వ్యవసాయ కూలీలు, గిరిజన కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ నిర్బంధాలను లెక్కచేయకుండా వ్యవసాయ కూలీల కూలీ రేట్ల పెంపుకు ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయం సాధించారని కొనియాడారు. తునికాకు కార్మికుల కూలీ రేట్ల పెంపుకు జరిగిన ఉద్యమంలో మావోయిస్టుల బెదిరింపులు, దాడులను సైతం ధైర్యంగా ఎదుర్కొని కార్మిక హక్కుల కోసం రాజీపడని నాయకురాలిగా నిలిచారని తెలిపారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి కుటుంబ బంధాలకు అతీతంగా సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని కొనియాడారు. తన సొంత కుమార్తె ప్రత్యర్థి అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన ఆమె నిబద్ధత నేటి తరం కార్యకర్తలకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ ప్రభావంతో మహిళలపై దాడులు, వివక్ష పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వరాజ్యేశ్వరమ్మ వంటి ఉద్యమ నాయకురాళ్ల పోరాట చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. స్వరాజ్యేశ్వరమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్