బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

15 నుంచి కులవివక్ష లేని సమాజం కోసం "సామాజిక శంఖారావం"

3 గంటల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 06:21 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఆగస్టు 15ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిద్దాం

  • మార్కాపురంలో "సామాజిక శంఖారావం" జిల్లా సదస్సు

ప్రజాశక్తి-మర్కాపురం : దళితుల ఆత్మగౌరవం కోసం, కులవివక్ష లేని సమాజ నిర్మాణం కోసం జూలై 15 నుంచి చేపట్టనున్న "సామాజిక శంఖారావం" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, పెరియార్, శ్రీ నారాయణ గురు, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్యల స్ఫూర్తితో దళితుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అధ్యయన యాత్రలు, ఆందోళనలు, ప్రత్యక్ష కార్యాచరణల ద్వారా "సామాజిక శంఖారావం"ను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం మరియు ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మార్కాపురంలో జిల్లా స్థాయి "సామాజిక శంఖారావం" సదస్సు నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వాజి రాజు అధ్యక్షత వహించగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా బాల నాగయ్య కార్యక్రమాల కార్యాచరణను వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. జూలై 15 నుంచి ఆగస్టు 24 వరకు మూడు దశల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి దశలో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కులవివక్ష రూపాలను అధ్యయనం చేసి, అనంతరం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఆగస్టు 15న ఆలయాల ముందు జాతీయ జెండాలు ఎగురవేసి, ఆలయ ప్రవేశ కార్యక్రమాల ద్వారా జాతీయ సమైక్యతను చాటుతామని తెలిపారు. కులవివక్షకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని, ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారతదేశంలోనే కులవ్యవస్థ తీవ్ర సామాజిక వివక్షకు కారణమవుతోందని అన్నారు. ఉద్యమాల ద్వారానే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, జీవో నెం.1235 వంటి విజయాలు సాధించామని గుర్తుచేశారు. సామాజిక న్యాయం పేరుతో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు ఇస్తున్నప్పటికీ, ఆచరణలో వివక్ష కొనసాగుతోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధుల్లో కనీసం 25 శాతం దళితవాడల అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ అంశంపై స్పందించిన రాజకీయ నాయకులు, కులవివక్ష వంటి అత్యంత కీలక సామాజిక సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. అలాగే ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కులవ్యవస్థను బలోపేతం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. పేదలకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను హరిస్తోందని విమర్శించారు. దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని, దళాలుగా ఏర్పడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్వే చేపట్టి సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి సమస్యలను పరిశీలించి వాటిపై ప్రజాపోరాటాలు నిర్వహించడం ద్వారానే ఉద్యమం బలోపేతం అవుతుందని అన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి. సోమయ్య మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో కూడా కులవివక్ష తగ్గలేదని, సంక్షేమ పథకాల అమలులో వివక్ష కొనసాగుతోందని విమర్శించారు. ఇప్పటికీ అద్దె ఇళ్లు తీసుకునే సమయంలో దళితులు కులవివక్షను ఎదుర్కొంటున్నారని, దళితుల స్మశానవాటికలను ఆక్రమించే ఘటనలు కొనసాగుతున్నాయని అన్నారు. యువత ఉద్యమాల్లోకి రావడం ద్వారానే హక్కులు సాధించగలమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు డి తిరుపతిరెడ్డి,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎంకే రఫీ, టి ఆవులయ్య, పి సి కేశవరావు, షేక్ అన్వర్ భాష, పి రూబేను,జె.నాగరాజు,పి నరేంద్ర, వి.రాజ్యలక్ష్మి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె. మాల్యాద్రి, కె.వెంకటమ్మ, ఎం. రమేష్.కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి. యోబు, నాగ మల్లేశ్వరి, కె. నరేష్ విద్యార్థి సంఘం నాయకులు డి వందన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్