బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కుల వివక్ష నిర్మూలనకు 'సామాజిక శంఖారావం'..

2 గంటల క్రితం

vk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 09:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రజా సంఘాలు ఏకమవ్వాలి

  • రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అన్ని ప్రజా సంఘాలు ఏకమై "సామాజిక శంఖారావం" పూరించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో "కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం" పేరిట జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో కృష్ణయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులని, ఆర్టికల్-15 కుల వివక్షను నిషేధిస్తుందని, ఆర్టికల్-17 అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని గుర్తుచేశారు. అయితే, నేటికీ హోటళ్లు, పంచాయతీ అరుగులు, బహిరంగ ప్రదేశాలు, సామూహిక భోజనాల్లో దళితులను సమానంగా కూర్చోనివ్వకపోవడం, దళితుల పెళ్లి ఊరేగింపులను అగ్రవర్ణ వీధుల్లో అనుమతించకపోవడం, దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకపోవడం, కులాంతర వివాహాలు చేసుకున్న వారిని వెలివేయడం, ఉపాధి హామీ పనుల్లో వివక్ష చూపడం వంటి అనేక రూపాల్లో సామాజిక వివక్ష కొనసాగుతూనే ఉందని ఆయన విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రవిబాబు మాట్లాడుతూ.. 1955లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం, 1989లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ, దళితులు ఇప్పటికీ సుమారు 15 రకాల వివక్షలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని దళితవాడల్లో డ్రైనేజీ, తాగునీరు, సిమెంట్ రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. మరణించిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన స్థలాలు లేని గ్రామాలు జిల్లాలో 80కి పైగా ఉన్నాయని తెలిపారు. జీఓ నెం.1235 ప్రకారం ప్రతి గ్రామంలో రెండు ఎకరాల భూమిని స్మశాన వాటిక కోసం కేటాయించాలని, ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే మార్కెట్ ధరకు ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని, ప్రహరీ గోడ, బోరింగ్, షెడ్ తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటి అమలు జరగడం లేదని విమర్శించారు. ఇటీవల దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. మతం మారినా కుల వివక్ష వెంటాడుతూనే ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. భూమి లేని దళిత పేదలకు సాగుభూమి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 16 నుంచి వచ్చే నెల (ఆగస్టు) 23 వరకు జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు, అవగాహన కార్యక్రమాలు, అధికారులకు వినతిపత్రాల అందజేత ఉంటుందని, అలాగే ఆగస్టు 24న కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంకాయలపాటి శివ నాగరాణి, జిల్లా అధ్యక్షురాలు మాధవి, సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. ఆంజనేయులు నాయక్, ప్రజా సంఘాల నాయకులు ఏ. లక్ష్మీశ్వర రెడ్డి, నాగమల్లేశ్వరరావు, పెద్దిరాజు, నాగేశ్వరరావు, జి. బాలకృష్ణతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్