ఏలూరులో ఎపి రైతు సంఘం రాష్ట్ర మహాసభ ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. ఈ మహాసభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో కొందరు ఆయా జిల్లాల్లో జరిగిన పోరాటాల అనుభవాలను ‘ప్రజాశక్తి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే...
రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అందరూ కలిసి శ్రీ సత్యసాయి జిల్లాల్లో సుమారుగా లక్ష 57 వేల 315 ఎకరాల భూమిని 11 సోలార్ కంపెనీలకు దారధత్తం చేయాలని చూస్తే రైతులతో కలిసి ఐక్య ఉద్యమాలు చేపట్టాం. ఎనిమిదేళ్ల క్రితం నమలకుంట అనే గ్రామంలో ఆరువేల ఎకరాలలో సోలార్ ప్లాంటు ప్రారంభించి, అప్పటి రైతులకు మాయమాటలు చెప్పి భూములు తీసుకుని ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. భూములు లాక్కున్న విషయం రైతులకు తెలియజేయడానికి 40 నుంచి 50 గ్రామాలలో కరపత్రాల ద్వారా ప్రచారం చేశాం. హిందూపురం, మడకశిర ప్రాంతాలలో ఏడువేల ఎకరాలలో మల్బరీ పంటను సాగు చేసిన నాలుగువేల మంది రైతులకు సంబంధించి గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రూ. 82 కోట్లు ఇన్సెంటివ్ ఎగొట్టింది. రైతుల తరుపున రైతు సంఘం పోరాడుతూ అండగా నిలుస్తుంది.
- రైతు సంఘం సత్యసాయి జిల్లా కార్యదర్శి హరి
రైతుల ఆత్మహత్యలపై తీవ్ర నిర్లక్ష్యం
పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక, బీమా ఇవ్వకపోవడంతో రెండేళ్లలో 86 మంది రైతులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రూ. ఏడు లక్షలు నష్టపరిహారం ఇవ్వకపోగా వారి కుటుంబాలను సైతం పరామర్శించని పరిస్థితి నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి దత్తత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పంటలు పండే భూములను భూ సేకరణ చేయడం వలన రైతులు వలస వెళ్తున్నారు. అనంతపురం జిల్లాను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ నీ ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. గిట్టుబాటు ధరల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మూడు రోజులు పాటు ధర్నాలను నిర్వహించాం. ఉరవకొండ ప్రాంతంలో మిరప మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పాదయాత్ర చేసి, ఒత్తిడి తీసుకొచ్చి పంటలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించాం.
- రైతుసంఘం అనంతపురం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
కరేడు భూకేటాయింపులపై పాలకుల ద్వంద్వ వైఖరి
గత ప్రభుత్వం కరేడు ప్రాంతం లో ఇండో సోలార్ ప్రాజెక్ట్ కోసం 5700 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆనాడు తప్పు అని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8400 ఎకరాలు అదే కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కలిసి వచ్చిన అన్ని సంఘాలను కలుపుకొని రైతు సంఘంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ఈ పోరాటం వల్ల భూసేకరణ కొంత నెమ్మదించింది. వర్జీనియా పొగాకు ధరలు పడిపోవడంతో ఒక్కో బేరన్ కు ఆరు లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించి పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక రూపాలలో ఉద్యమం చేపట్టాం. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి నీరంతా సముద్రం పాలయ్యింది. రైతులందరిని ఐక్యం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు గేట్లు పునర్నిర్మాణం చేపట్టేలా చేశాం. జిందాల్ స్టీల్ కంపెనీకి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నుంచి 0.3 టిఎంసిల నీటిని ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. ఇలాగే కొనసాగితే 1,20,000 ఎకరాలు బీడు బారే ప్రమాదం ఉంది. దీనిపై కూడా భవిష్యత్తులో పోరాటం చేస్తాం.
- రైతు సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి జె. జయంతి బాబు








కామెంట్‌లు (0)