మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మొబైల్‌ టవర్లకు భూమి అద్దె, విద్యుత్‌ ఛార్జీల రాయితీ

07 ఆగస్టు, 2026

towers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 09:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మొబైల్ సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన విధానం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెలికాం మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రోత్సాహంగా, మొబైల్ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని అద్దె లేకుండా ఇవ్వడంతో పాటు రాయితీ విద్యుత్ సరఫరా కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ శాఖ ‌శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం.. మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని అద్దె లేకుండా కేటాయించడంతో పాటు, టవర్లు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే వరకు రాయితీ విద్యుత్ అందించనున్నారు. ఒక్కో టవర్‌కు సుమారు 450 మంది చందాదారులు చేరుకున్న తర్వాత అది వాణిజ్యపరంగా లాభదాయక స్థాయికి చేరుకున్నట్లు పరిగణించి, ఆ దశ నుంచి రాయితీ విద్యుత్ నిలిపివేసి సాధారణ విద్యుత్ చార్జీలు అమలు చేయాలని నూతన విధానంలో నిబంధనలు రూపొందించారు. టెలికాం సంస్థలు నిర్ణీత గడువులోగా మొబైల్ టవర్లు, అనుబంధ మౌలిక సదుపాయాలు, ఇంట్రా-సర్కిల్ రోమింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసి అన్ని నెట్‌వర్క్‌ల వినియోగదారులకు అంతరాయం లేని సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వ సహాయాన్ని ప్రతి మూడేళ్లకోసారి సమీక్షించి, టవర్లు వాణిజ్యపరంగా లాభదాయకంగా మారిన ప్రాంతాల్లో రాయితీల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. 100 శాతం టెలికాం కనెక్టివిటీ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యుత్ శాఖ రాయితీ విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టగా, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ భూమి కేటాయింపును వేగవంతం చేయాలని సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్