శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపేదలకు దక్కని భూ హక్కు పత్రాలు

1 గంట క్రితం

lands
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 10:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యక్ష పోరాటం : వ్యకాస

ప్రజాశక్తి - గన్నవరం (కృష్ణా జిల్లా) : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు భూ హక్కు పత్రాలు ఇవ్వకపోవడం వల్ల వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పంట రుణాలు, నష్టపరిహారం పొందలేక నష్టపోతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ​బాపులపాడు మండలంలోని బొమ్మలూరు కొత్తపల్లి గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బొమ్మలూరు పంచాయతీ పరిధిలోని బి.కండ్రిక గ్రామానికి చెందిన దళితుల స్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురైందని, సరైన దారి కూడా లేదని, ఆ పరిస్థితుల్లోనే అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సి వస్తోందని తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో 1977, 1987లలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఇప్పటికీ ఆన్‌లైన్ కావడం లేదని, పాస్ పుస్తకాల కోసం కొందరు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ​ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితుల స్మశాన భూమి ఆక్రమణపై అధికారులు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 లోపు ఈ సమస్యలను పరిష్కరించకపోతే బాధితులతో కలిసి ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో మండల కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ బారీ, సిఐటియు నాయకులు జె.ఏసుపాదం, కోరం ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్