బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భాషా వలంటీర్ల వెట్టిచాకిరీ

2 రోజుల క్రితం

girijan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేటికీ రూ.5 వేలే వేతనం

- ఆదివాసీ మాతృ బహుభాషా విద్యా వలంటీర్లు దుస్థితి

ప్రజాశక్తి- సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) : కొన్ని ఉద్యోగాలు పేరుకే ప్రభుత్వ కొలవులు. నిత్యం వెట్టిచాకిరే.. పనికి తగ్గ ఫలితం లేకపోవడంతో కనీసం కుటుంబాలు కూడా పోషించలేని పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారినా వారి జీవితాల్లో మార్పు మాత్రం రావడం లేదు. 24 ఏళ్లుగా పనిచేస్తున్న ఇంకా రూ.5 వేలు వేతనానికే పరిమితమయ్యారు. వారే ఆదివాసి మాతృ బహుభాషా విద్యా వలంటీర్లు (సవరభాష విద్యా వలంటీర్లు). గిరిజన విద్య అభివృద్ధి కోసం వీరు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాంటి వారిని పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇప్పటికే పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినతుల అందజేసినా ప్రయోజనం కనిపించలేదు.

కొండ శివారు మారుమూల గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు పాఠశాలలకు వెళ్లకుండా బడి బయట కనిపించడంతో అప్పటి సీతంపేట ఐటిడిఎ పిఒ సంజయ్ కుమార్ 2002లో విద్యార్థులు డ్రాపౌట్ గా మారుతున్నారనే, వారి భాషలోనే ఆటపాటలతో సులభ పద్ధతిలో చదువు చెప్పిస్తే వారు పాఠశాలకు వస్తారనే ఉద్దేశంతో 2002లో సవర భాష విద్యా వలంటీర్ లను నియమించారు.

మొదటిసారిగా సీతంపేట ఐటిడిఎలోనే 20 పాఠశాలలు నెలకొల్పారు. ఆదివాసి మాతృబహుభాష విద్యా వాలంటీర్లను నియమించారు. వీరికి నెలకు వెయ్యి రూపాయలు వేతనం ఇప్పట్లో ఇచ్చారు. చిన్నారులు పాఠశాలలకు రావడంతో 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సవర, కోయ, గోండు, బంజారా, ఆదివాసి ఒరియా, కూవి, కొండ... ఎనిమిది భాషలతో 20 పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో అన్ని ఐటిడిఎ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, జిపిఎస్ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ఎంపిపి స్కూళ్లు అనుబంధంగా ఏర్పాటు చేశారు. ఒకటి నుండి మూడు తరగతుల వరకు అక్కడ విద్యార్థులకు వారి భాషలో సులువుగా విద్యాబోధన అందిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 1,274 పాఠశాలలకుగానూ ప్రస్తుతం 1572 పాఠశాలలకు పెంచారు. పాఠశాలలు అభివృద్ధి చెందినా తమకు జీతం మాత్రం పెంచకపోవడం దారుణమని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలు వేతనం ఏ మేరకు సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని 2023లో నారా లోకేష్ కు పాదయాత్రలో వినతి పత్రం అందజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్నా రెండేళ్లు కావస్తున్నా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కూడా వలంటీర్లు విన్నవించారు. గతంలో అమరావతిలోను, ఐటిడిఎల వద్ద వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినా కేసులు పెట్టి జైలుకు పంపారే తప్ప, తమకు ఎటువంటి న్యాయమూ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో త్రిపుర, కేరళలోని సిపిఎం ప్రభుత్వాలు రెగ్యులర్ చేయడంతోపాటు, వేతనాలు పెంచిందని, అదే మాదిరిగా మన రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని ఆదివాసీ మాతృ బహుభాష విద్యా వలంటీర్లు కోరుతున్నారు.

జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలి

సవర భాష విద్య వాలంటీర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రెగ్యులర్ ఉపాధ్యాయులు మాదిరిగా పనిచేస్తున్నాం. అయినా వేతనం తక్కువ ఇస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనాలు పెంచాలి. పాఠశాలల పున: ప్రారంభం నుంచే విధుల్లోకి తీసుకోవాలి. మహిళా వలంటీర్లకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి.


- సవర డోంబు, ఆదివాసీ మాతృ బహువాస

విద్యా వలంటీర్ల సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి, సీతంపేట

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్