శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసు నిర్బంధాన్ని ఖండించిన వామపక్షాలు

1 గంట క్రితం

vsr.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 06:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 11న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు

ప్రజాశక్తి – విజయవాడ: ఛలో లోక్‌భవన్‌ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్టులు చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పోలీసు నిర్బంధానికి నిరసనగా ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. 13 కోట్ల మంది ఓటర్ల హక్కులను హరిస్తున్నారని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌–SIR) ప్రక్రియను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షాలు, ప్రజాసంఘాలు ఛలో లోక్‌భవన్‌కు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అర్ధరాత్రి నుంచే పలువురిని గృహనిర్బంధం చేశారని, పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులను మోహరించి కార్యక్రమాన్ని భగ్నం చేశారని వామపక్షాలు ఆరోపించాయి. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యాలయాలను దిగ్బంధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నాయి.

పోలీసుల దాడిలో విద్యార్థులకు గాయాలు

పోలీసుల దాడిలో ముగ్గురు విద్యార్థి కార్యకర్తలు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వామపక్షాలు తెలిపాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షురాలు జ్యోతి స్పృహ కోల్పోగా, పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు వంశీ, ఏలూరు జిల్లా కార్యకర్త మాధవ్‌ కూడా గాయపడ్డారని పేర్కొన్నాయి. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించలేదని ఆరోపించాయి. సుమారు 300 మంది వామపక్ష, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం, భవానీపురం, కొత్తపేట టూటౌన్‌, సింగ్‌నగర్‌, నున్న, సత్యనారాయణపురం, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్లలో ఉంచినట్లు తెలిపాయి. అరెస్టయిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌. బాబూరావు, వి. ఉమామహేశ్వరరావు, వి. రాంభూపాల్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్‌, ఇతర వామపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారని పేర్కొన్నాయి. అరెస్టయిన నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం నాయకుడు వై.వెంకటేశ్వరరావు, లిబరేషన్‌ నాయకుడు హరినాథ్‌, ఎం.ఎల్‌. కిషోర్‌బాబు, కాంగ్రెస్‌ నాయకులు జేడీ శీలం, కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో నిర్బంధాన్ని నిలిపివేయాలి

ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహించకుండా పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించారని వామపక్షాలు ఆరోపించాయి. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతోపాటు మెట్రో, ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకుని ప్రజలకు ఇబ్బందులు కలిగించారని విమర్శించాయి. సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌ను పోలీసులు దిగ్బంధించారని, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌ వద్ద దాడి చేసి పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని పేర్కొన్నాయి.

సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సీనియర్‌ నాయకులు మాణిక్‌ సర్కార్‌, బృందా కారత్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర కమిటీ సభ్యులు డి. రమాదేవి, కె. లోకనాథంతో పాటు పలువురు జాతీయ నాయకులను అరెస్టు చేశారని తెలిపాయి. ఈ నిర్బంధ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే నిరసనల్లో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, పౌరహక్కుల సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్