శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓట్‌ చోర్‌‌పై నిరసనాగ్రహం. : జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మల దహనం

58 నిమిషాల క్రితం

ఓట్‌ చోర్‌‌పై నిరసనాగ్రహం.!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మలు దహనం
పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌

ప్రజా స్వామ్యాన్ని పతనం చేసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న చర్యలపై వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రమాదంలో పడిన ప్రజల ఓటును కాపాడేందుకు సర్‌‌ను ప్రక్రియను రద్దు చేసి, ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్‌ కుమార్‌ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మండలాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లో సిపిఎం, సిపిఐతో పాటు ఇతర వామపక్షాలు, కాంగ్రెస్‌, వైసిపి పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలతో కలిసి భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. జ్ఞానేష్ కుమార్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నా నాయకులు వారిని ఎదురించి  జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సర్‌ ప్రక్రయ పేరుతో బిజెపి అక్రమంగా ఓట్ల తొలగిస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అనంతపురం కలెక్టరేట్ :

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఓట్ చోర్‌ జరుగుతోందని, దానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రధాని ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి త్రిసభ్య హైపవర్ కమిటీ ద్వారా సిఇసి నియమించాలని వామపక్ష, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. దేశంలో జరిగిన ఓటు చోర్‌‌ను ఖండిస్తూ, సిఇసి జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, సర్‌ ‌ప్రక్రయను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో వామపక్ష, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. టవర్‌క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై గళమెత్తారు.సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.నాగేంద్ర కుమార్, వి.రామిరెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి డాక్టరు శైలజానాథ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాదాగాంధీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వేమనలు పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకంగా ఉన్న ఎన్నికల వ్యవస్థ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుందని విమర్శించారు. వరుసగా మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా మోడీ అయ్యారంటే ఓటు చోరీ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. ఎన్నికల సంఘాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మైనార్టీలు, దళితులు, పేదలు, యువత ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని, ఈ ఓట్ల తొలగింపు చర్య రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈవీఎంలను పక్కనబెట్టి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఓటు చోరీతో ఏర్పాటైన ప్రభుత్వాలు కొనసాగేందుకు వీలులేదని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారాన్ని వీడాలని డిమాండ్ చేశారు. 2029లోనూ అక్రమ మార్గాల్లో అధికారంలోకి రావడానికి ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం బానిసగా మార్చుకుందని విమర్శించారు. 2023 సంవత్సరంలో తీసుకొచ్చిన చట్ట సవరణల ద్వారా సీఈసీ నియామకంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించారని, జ్ఞానేష్‌ కుమార్ నియామకమే చెల్లదని అన్నారు. వ్యవస్థలపై నమ్మకం కలగాలంటే 2023 చట్టాన్ని రద్దు చేయాలని, ఈవీఎంలను పక్కనబెట్టి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జ్ఞానే‌ష్‌ కుమార్ రాజీనామాతో పాటు ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనే ధ్యేయంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి, తొలగించిన ఓట్లను యథాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వలి, గోపాల్, వెంకటనారాయణ, ఐద్వా నగర కార్యదర్శి అశ్విని, సిపిఐ జిల్లా నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా నాయకులు కేశవరెడ్డి, నారాయణస్వామి, పద్మావతి, రమణయ్య, వికె.కృష్ణుడు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వీరనారప్ప, వైసిపి నాయకులు, మాజీ మేయరు వశీం, మాజీ డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వైసిపి జిల్లా నాయకులు రమేష్ గౌడ్, సాకే చంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసు, జాకీర్, షానావాజ్, న్యూ డెమోక్రసీ నాయకులు కిష్ట, ఫక్రుద్దీన్, లిబరేషన్ నాయకులు లక్ష్మీ నారాయణ, వలి, ఎస్సీ, ఎస్టీ జెఎసి నాయకులు సాకే హరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్