శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసుపత్రి ఆవరణలో అనాథల్లా... పావలా శ్యామలా ఆమె కూతురు ..!

2 గంటల క్రితం

Like orphans within the hospital premises... Pavala Shyamala and her daughter!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 11:33 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్ : ఒకప్పుడు వెండితెరపై తనదైన నటనతో, హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల జీవితం ఇప్పుడు అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఆమె, నేడు వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్యం, కరవైన ఆదరణ నడుమ అనాథగా మారడం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను సైతం తీవ్రంగా కలచివేస్తోంది.


గురువారం ఉదయం హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో పావలా శ్యామల, ఆమె కుమార్తె మాధవిలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సూపరింటెండెంట్‌ డాక్టర్ శ్రవణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు వైద్యులు వారికి క్షయ (టీబీ) పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అయితే, ఇతర తీవ్రమైన శారీరక ఇబ్బందులు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ ఉండలేక వారు సాయంత్రానికి మళ్లీ ఛాతీ ఆసుపత్రికే తిరిగి వచ్చారు. దీంతో స్పందించిన ఆసుపత్రి వర్గాలు బోరబండ పోలీసులకు సమాచారం అందించాయి. చివరకు శుక్రవారం నాడు పోలీసుల ప్రత్యేక రక్షణ నడుమ వీరిద్దరినీ నగరంలోని ఒక సురక్షితమైన అనాథాశ్రమానికి తరలించి ఆశ్రయం కల్పించారు.


ఆసుపత్రి నుంచి రోడ్డుపైకి..

ఈ ఘటనకు ముందు కూడా ఆమె జీవితం కల్లోలంగానే ఉంది. గతంలో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో, వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. ఆ క్రమంలో కారు డ్రైవర్ ఆమెను మధ్యలోనే రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు. రోడ్డుపై అనాథగా మిగిలిన ఆమెను కొందరు స్థానికులు గుర్తించి, ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఈ సంఘటనలు ఒకనాటి స్టార్ నటి ప్రస్తుత దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పావలా శ్యామల కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు సంపాదన బాగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల కోసం సరైన రీతిలో డబ్బును పొపు చేయలేకపోయారు. సినిమా రంగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ అవకాశాలు, ఆదాయం ఎల్లప్పుడూ నిలకడగా ఉండవు. రాబడి ఎక్కువగా ఉన్న కాలంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోకపోవడం, భవిష్యత్తు భద్రతపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఆమె నేడు ఈ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. వయసు పైబడటంతో వచ్చే సహజమైన అనారోగ్య సమస్యలతో పాటు, కూతురు కూడా తీవ్ర వ్యాధి బారిన పడటంతో ఆ కుటుంబం పూర్తిగా కుంగిపోయింది. రోజువారీ మందులు, కనీస అవసరాలు, ఇల్లు గడవడం కూడా వారికి కష్టతరమయ్యింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్