- పేదింటి రేషన్ కార్డుకు 24 కరెంటు బిల్లులు లింకు
- పంటకు నీరడిగితే కేసు పెట్టారు : ఓ రైతు
ప్రజాశక్తి – యంత్రాంగం : ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. వీరిలో రైతులు, ఉద్యోగస్తులు, ఇతరులు ఉండగా... తల్లికి వందనం డబ్బులు పడనివారే అధికంగా ఉన్నారు.
విజయనగరం పట్టణం ఉడాకాలనీ పరిధిలోని పాల్ నగర్ కు చెందిన బుద్దరాజు కృష్ణంరాజు–సుచిత్ర దంపతులు కాయాకష్టం చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. వీరి పేరున ఉన్న తెల్ల రేషన్ కార్డుకు 24 ఇళ్ల విద్యుత్ సర్వీసులు లింక్ కావడంతో తల్లికి వందనం, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. ఆన్‌లైన్ లోపాన్ని వెంటనే సరిచేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌కు వచ్చారు. గంట్యాడ మండలం పెనసాం గ్రామానికి చెందిన పాసల శ్రీరామ్మూర్తి కుమారుడు విష్ణువర్థన్ పేరు సాంకేతిక లోపం వల్ల అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం బురుగుపాలెంకు చెందిన కరక విష్ణువర్థన్ ఆధార్ అడ్రస్‌తో మ్యాపింగ్ అయ్యింది. వీరికి కూడా తల్లికి వందనం పథకం వర్తించలేదు.
జామి మండలం జెట్టేటివలస గ్రామానికి సుమారు 15 కుటుంబాలవారు సర్వే నెంబర్ 70-1లో సుమారు 52 సెంట్లను తాత తండ్రుల నుంచి సాగుచేసుకుంటూ జీవించేవారు. మూడు తరాలు మారడం, మారిన పరిస్థితుల్లో స్థానికంగా సరైన జీవనోపాధి లేకపోవడంతో ఇందులో కొన్ని కుటుంబాలవారు ఉపాధి కోసం వలస వెళ్లారు. మరికొందరు స్థానికంగా కాయకష్టం చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నారు. ఈ భూమి వీరి పూర్వికుల నుంచి అనుభవిస్తున్నట్టుగా ఎఫ్ సిఒ రికార్డుల్లో కూడా ఉన్నప్పటికీ వాటాదారుగా ఉన్న ఓ వ్యక్తి మొత్తం ఆక్రమించుకోజూశాడు. రీ సర్వేకు వచ్చిన సిబ్బంది ఆ వ్యక్తి చెప్పినట్టుగా నమోదు చేశారు. దీనిపై నిలదీసిన తమపై పోలీసులను ఉసిగొల్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కలెక్టరేట్‌లో కొత్తలి కొండమ్మ, చలుమూరి సింహాచలం, సూరెడ్డి పెంటయ్య సహా బాధితులంతా ఫిర్యాదు చేశారు.
మ్యాపింగ్ సమస్యతో తల్లికి వందనం రాలేదు
హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో 11 మంది ఒకే కుటుంబంగా ఉండటంతో తల్లికి వందనం వర్తించడం లేదని అనంతపురానికి చెందిన ప్రసాద్, వీరయ్య అనే అన్నదమ్ములు అనంతపురం కలెక్టర్ ఒ.ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. తమను రెండు కుటుంబాలుగా విడదీయాలని చేయాలని కోరారు. అయితే, హౌస్ హోల్డింగ్‌ను స్పిల్ట్ చేసే ఆప్షన్ తమ పరిధిలో లేదని, రాష్ర్ట ప్రభుత్వ స్థాయిలో జరగాల్సి ఉందని అధికారులు తెలిపినట్టు వీరయ్య తెలిపారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించొద్దని, ఆర్‌టిసిని ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఎపిపిటిడి (ఆర్‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిప్రతం అందజేశారు. ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ ఉద్యోగుల తోనే నిర్వహించాలని జెఎసి రాష్ట్ర నాయకులు వివి.మోహన్, జెఎం.నాయుడు, అల్లు సురేష్ నాయుడు, సత్యవతి, పిజి పతి వినతిప్రతంలో కోరారు.
పంటకు నీరు అడిగినందుకు కేసు పెట్టారు : రైతు
కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల గుబ్బలవారి పాలేనికి చెందిన రైతు గెద్దాడ త్రిమూర్తులు తన అర ఎకరం పొలాన్ని సోదరుడు సత్యనారాయణతో కలిపి సాగు చేసుకుంటున్నారు. పంటకు నీరివ్వాలని ఇంద్రపాలెం లాకుల వద్ద నీటిపారుదల శాఖ కార్యాలయంలో కోరగా లంచం డిమాండ్ చేశారని, తాను లంచం ఇవ్వలేనని చెప్పడంతో కక్షగట్టి దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పెద్దలతో కలిసి కేసు రాజీ చేసుకునేందుకు ప్రయత్నిస్తే హేళనగా మాట్లాడి కించపరిచారని తెలిపారు. న్యాయం కోరుతూ కలెక్టర్‌కు వినతిప్రతం అందించగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వమే నేరుగా వాటిని కొనుగోలు చేసి నడపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ (ఎపిపిటిడి - ఆర్‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. విజయవాడ లోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ‘సమస్యల పరిష్కార వేదిక’లో ఉచిత బస్సు ప్రయాణ రద్దీకి సరిపడా కొత్త బస్సులు కొనాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, పెండింగ్ డిఎ బకాయిలతో పాటు 12వ పిఆర్‌సి అమలు చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు.








కామెంట్‌లు (0)