అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : ల్యాండ్ పూలింగ్ గ్రామాలన్నింటిని కలిపి మెగా సిటీ గా అభివృద్ధి చేయాలని భావిస్తున్నందున గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాలతో పాటు అమరావతి మండలంలోని పెదమద్దూరు, వైకుంఠపురం, కర్లపూడి, ఎండ్రాయి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు కొంత అంతరాయం కలిగిందని, ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తి అయ్యిందని, ప్రతి రెండు నెలలకు ఆరు అంతస్తుల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఐకానిక్ అసెంబ్లీ, హైకోర్టు ఫౌండేషన్ పనులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రజాప్రతినిధుల భవనాలు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. నవంబర్ 11 తర్వాత వీటిని ప్రారంభిస్తామని తెలిపారు. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు,1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అమరావతిలో ప్రస్తుతం 35 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, సిఎం చంద్రబాబు చెప్పిన ప్రకారం 2028 అక్టోబర్ నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. రాజధాని అమరావతి రోడ్ నెట్‌వర్క్‌పై సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో డిసెంబర్ నాటికి మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుందని, ఈ ప్రణాళికలో భాగంగా అమరావతి నుంచి గుంటూరుకు ప్రజలు నేరుగా, సులభంగా చేరుకునేలా సమాంతర రహదారిని డిజైన్ చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ నేషనల్ స్పోర్ట్ సిటీ కోసం మూడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని, వచ్చేనెలాఖరుకు 75 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తవుతుందని వివరించారు.






కామెంట్‌లు (0)