మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘శ్రేష్ఠ’ విద్యార్థులకు స్థానిక హోదా కొనసాగించాలి

3 రోజుల క్రితం

school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రేష్ఠ పథకం ద్వారా రాష్ట్రం వెలుపల చదువుతున్న ఎస్సి విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశాల సమయంలో స్థానిక హోదా కోల్పోతున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని కెవిపిఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ కోరాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌‌ను సచివాలయంలో శుక్రవారం కలిసి కెవిపిఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి అండ్రమాల్యాద్రి(కెవిపిఎస్‌), ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శులు కె. ప్రసన్నకుమార్, జి. రామన్న వినతిపత్రం అందించారు. శ్రేష్ఠ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక మంది ఎస్సి విద్యార్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిష్ఠాత్మక పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో చదువుతున్న కారణంగానే వారు రాష్ట్రం వెలుపల విద్యాభ్యాసం చేస్తున్నారని పేర్కొన్నారు. ​ప్రస్తుతం అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా ఈ విద్యార్థులను నాన్-లోకల్‌గా పరిగణించడంతో ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాల సమయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద దళిత కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ తప్పు వల్ల కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్రం వెలుపల చదివిన కారణంగా స్థానిక హోదా కోల్పోవడం అన్యాయమని పేర్కొన్నారు. శ్రేష్ఠ పథకం లక్ష్యం ఎస్సి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం మాత్రమేనని వివరించారు. ఆ పథకంలో చేరినందుకు వారిని శిక్షించినట్లుగా స్థానిక హోదాను కోల్పోయే పరిస్థితి ఏర్పడకూడదని పేర్కొన్నారు. సంబంధిత జీవోను సవరించి విద్యార్థులకు స్థానిక హోదా కొనసాగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు రమేష్, అబ్దుల్లా పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్