దలాల్ స్ట్రీట్‌పై బేర్ పంజా
ఒక్కరోజే రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి: దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల భారీ విక్రయాలు, అమెరికా బాండ్ రాబడులు ఎగబాకడం, రూపాయి పతనం, చమురు ధరలు, అంతర్జాతీయ అనిశ్చితి దేశీయ స్టాక్ మార్కెట్ల ను వరుసగా నాలుగో సెషన్‌లోనూ కుదిపేశాయి. గురువారం సెన్సెక్స్ ఒక దశలో 1,200 పాయింట్లకు పైగా పతనమై 71,292కు క్షీణించి.. 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 571 పాయింట్లు కోల్పోయి 71,910 వద్ద ముగిసింది. నిఫ్టీ 199 పాయింట్లు పతనమై 22,422కు పరిమితమైంది. ఈ ఒక్కరోజు బిఎస్‌ఇలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్ల సంపద హరించుకుపోయి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.467 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది.
తరలిపోతున్న ఎఫ్‌ఐఐలు..
మార్కెట్ పతనానికి విదేశీ మదుపర్ల అమ్మకాలు ప్రధాన కారణంగా మారాయి. బుధవారం రూ.10,148 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించిన ఎఫ్‌ఐఐలు, అంతకుముందు రోజు మరో రూ.10,743 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఒక్క వారంలోనే వారి విక్రయాలు రూ.26,000 కోట్లకు చేరాయి. దీనికి తోడు అమెరికా పదేళ్ల ట్రెజరీ రాబడులు 2007 తర్వాత తొలిసారిగా 5.31 శాతానికి చేరడంతో రిస్క్ ఉన్న ఈక్విటీల నుంచి పెట్టుబడులు తరలుతున్నాయి. డాలర్ బలపడటంతో రూపాయి 96.31 వద్ద రెండు నెలల కనిష్ఠానికి పడిపోయింది. మారుతీ సుజుకీ షేరు 5 శాతం వరకు పడిపోగా, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్ కూడా నష్టాల్లో ముగిశాయి.
2001 తర్వాత తొలిసారి..
నిఫ్టీ వరుసగా ఎనిమిదో వారమూ నష్టాలను చవి చూసింది. ఈ స్థాయిలో వరుస నష్టాలు గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. 2001లో నిఫ్టీ వరుసగా 9వారాల పాటు పడిపోయింది. ఆ తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘమైన పతనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 1993లో నిఫ్టీ వరుసగా 10 వారాల పాటు నష్ట పోయింది. సెప్టెంబర్ నెలలోనే నిఫ్టీ 6.1 శాతం నష్ట పోయింది. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు విదేశీ మదుపర్లు భారతీయ ఈక్విటీల నుంచి రూ. 2.6 లక్షల కోట్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. తాజాగా నిఫ్టీ-500లో దాదాపు 81 శాతం షేర్లు తమ స్వల్పకాలిక సగటుల కంటే దిగువన ట్రేడింగ్ కావడం ఆందోళనకరం.
రిటైల్ ఇన్వెస్టర్లలో ఆందోళన..
చిన్న, మధ్యతరగతి మదుపర్లలోనూ ఆందోళన పెరిగింది. పిల్లల చదువులు, రిటైర్మెంట్, భవిష్యత్ అవసరాల కోసం ఎస్‌ఐపిలు, మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టిన రిటైల్ మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియో విలువ తగ్గడంతో బెంబేలెత్తుతున్నారు. నిఫ్టీ తన కీలకమైన వీక్లీ 200-ఎస్ఎంఎ జోన్ అయిన 22,600-22,580 స్థాయిల దిగువకు పడిపోయింది. ఒకవేళ 22,400 స్థాయి మద్దతును నిలబెట్టుకోవడంలో విఫలమైతే పతనం మరింత పెరిగి 22,200 నుంచి 22,000 స్థాయిల వరకు పడిపోయే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణుల అంచనా వేస్తున్నారు.








కామెంట్‌లు (0)